యూఎన్ సంచలన రిపోర్ట్: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ ఉగ్ర సంస్థ

యూఎన్ సంచలన రిపోర్ట్: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ ఉగ్ర సంస్థ

న్యూఢిల్లీ: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే టెర్రరిస్ట్ గ్రూప్ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) హస్తం ఉందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి విశ్లేషణాత్మక మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం 37వ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 

జైషే చీఫ్ మసూద్ అజార్ 2025, అక్టోబర్ 8న జమాత్-ఉల్-ముమినాత్ పేరుతో ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడని నివేదిక పేర్కొంది. ఎర్రకోట బ్లాస్ట్‎కు పాక్ కేంద్రంగా పని చేసే జైషే బాధ్యత వహించిందని ఇండియా యూఎన్‎కు తెలిపింది. ఇక, పాక్ తనకు అలవాటైన అబద్ధాలనే మళ్లీ పునరావృతం చేసింది. పాకిస్థాన్‎లో జైషే, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు యాక్టివ్‎గా లేవని చెప్పింది.   

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్:

2025,  నవంబర్ 11న భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. పేలుడు వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి వివిధ రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.