యూఏఈ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి

యూఏఈ చమురు కేంద్రంపై  ఇరాన్ దాడి
  • సౌదీ బేస్​లోని 5 యూఎస్ రీఫ్యూయెల్ జెట్​లు ధ్వంసం
  • దుబాయ్ పై మిసైల్ దాడి.. 
  • బాగ్దాద్​లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి 
  • ఖర్గ్ ఐలాండ్​పై అమెరికా దాడులకు తీవ్ర ప్రతీకారం
  • అమెరికా మిలిటరీ బేస్​లే మా టార్గెట్  
  • హార్మూజ్​లో నౌకలపై దాడులు కొనసాగిస్తాం 
  • అబుదాబి, దుబాయ్, ఫుజైరా పోర్టులపై దాడులు చేస్తాం 
  • అక్కడి నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరిక 


టెహ్రాన్:  ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా బాంబుదాడుల తర్వాత ఇరాన్ శనివారం తీవ్ర ప్రతీకార దాడులకు దిగింది. ఒకవైపు యూఏఈలోని ఫుజైరా ఆయిల్ 
టెర్మినల్​పై మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్.. మరోవైపు బాగ్దాద్​లోని అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి చేసింది. సౌదీ అరేబియాలోని ఎయిర్ బేస్​లో ఉన్న 5 యూఎస్ రీఫ్యూయెల్ జెట్ లనూ ధ్వంసం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్​లే తమ టార్గెట్ అని ప్రకటించింది. శనివారం ఒక్క రోజే యూఏఈపైకి 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లు దూసుకొచ్చాయి. అబుదాబి, దుబాయ్, ఫుజైరా పోర్టులపై దాడులు చేస్తామని, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలను హెచ్చరించింది. 

 
అలాగే హార్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు ఇకపైనా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్‌‌‌‌కు చెందిన రెండు బ్యాంకులపై అమెరికా దాడులు చేసినందుకు ప్రతిచర్యగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంక్ బ్రాంచీలపై తాము కూడా దాడులు చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్ సీ) ప్రాంతంపై ఇరాన్ నుంచి వరుసగా రెండు దాడులు జరగడంతో సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. అక్కడి సిబ్బందికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆదేశాలు జారీ చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఖతార్‌‌‌‌లోని తన శాఖలను హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ మూసివేసింది. తన సిబ్బంది అంతా ఇంటి నుంచే పని చేయాలని సూచించింది.

ఫుజైరాలో మంటలు 

యూఏఈ తీర ప్రాంత నగరం ఫుజైరాలో పోర్టు సమీపంలోని ఆయిల్ టెర్మినల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక డ్రోన్‌‌‌‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని, దాని శకలాలు పడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంధన కేంద్రం నుంచి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కేంద్రాలే ప్రధాన లక్ష్యంగా మారాయి. ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీ, ఖతార్‌‌‌‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ బేస్, యూఏఈలోని రువైస్ రిఫైనరీ కాంప్లెక్స్ వంటి ఇంధన కేంద్రాలపై దాడులు జరిగాయి. 

దుబాయ్ ఆర్థిక కేంద్రంపై మిసైల్ అటాక్

 
అమెరికా లక్ష్యంగా ఇరాన్ అనుకూల వర్గాలు జరిపిన దాడులతో గల్ఫ్ రీజియన్ అట్టుడుకుతున్నది. దుబాయ్‌‌‌‌పై వరుసగా రెండో రోజు క్షిపణి దాడులు చేసింది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం (డీఐఎఫ్‌‌‌‌సీ) సమీపంలో మిసైల్స్​ దూసుకురాగా.. గగనతలంలోనే  రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయితే, కూల్చివేసిన క్షిపణి శకలాలు ఒక భారీ భవనంపై పడటంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిప్రమాదం కూడా సంభవించలేదని దుబాయ్ మీడియా ఆఫీస్  ‘ఎక్స్‌‌‌‌ వేదికగా ధ్రువీకరించిది.

అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి

ఇరాక్‌‌‌‌ రాజధాని బాగ్దాద్‌‌‌‌లోని అత్యంత కట్టుదిట్టమైన ‘గ్రీన్ జోన్’లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్‌‌‌‌ డ్రోన్‌‌‌‌తో అటాక్‌‌‌‌ చేసింది. ఒక డ్రోన్ నేరుగా ఎంబసీ ఆవరణలోని హెలిప్యాడ్‌‌‌‌ను ఢీకొట్టినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.  ఎంబసీ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు వెలువడటం కనిపించింది. ఈ దాడిలో హెలిప్యాడ్‌‌‌‌ ధ్వంసమైనట్టు ఇరాక్‌‌‌‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. కాగా, అమెరికా ఎంబసీపై దాడికి ముందే, ఇరాన్ మద్దతున్న కటాబ్ హిజ్బొల్లా గ్రూపుపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఆ సంస్థకు చెందిన ఒక కీలక నేతతోపాటు మరో ఇద్దరు సభ్యులు హతమైనట్లు సమాచారం.

యూఏఈ పోర్టులు ఖాళీ చేయండి 

అబుదాబి, దుబాయ్, ఫుజైరా పోర్టుల వద్ద ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఎమిరాటి నగరాల ముసుగులో అమెరికా దళాలు వాడుకుంటున్న నౌకాశ్రయాలు, రేవులపై దాడులు చేయడం తమ "చట్టబద్ధమైన హక్కు" అని ఇరాన్ స్పష్టం చేసింది. దుబాయ్‌‌‌‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా పోర్టుల ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. పౌర నివాసాల మధ్య అమెరికా సైనిక బలగాలు దాగి ఉన్నందున, ఆ ప్రాంతాలన్నీ చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారాయని, రాబోయే కొన్ని గంటల్లో వాటిపై దాడులు జరుగుతాయని పేర్కొంది. ఎమిరాటి నగరాల ముసుగులో అమెరికా దళాలు ఉపయోగిస్తున్న ఓడరేవులపై దాడులు చేయడం తమ హక్కు అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.