- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 14,500 కోట్లతో నిర్మించనున్న హ్యామ్‌రోడ్ల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనగల్‌లో ఏర్పాటు చేయనున్న హ్యామ్ రోడ్ల పైలాన్, బహిరంగ సభ ప్రాంగణ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రితో ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేయించి, ఆలయ ఆధునికీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేయిస్తామన్నారు. సభకు హాజరయ్యే జనం కోసం టెంట్లు, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి కనగల్‌లో బహిరంగ సభ స్థలాన్ని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి ఉన్నారు.
రూ. 450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్ పనులు
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ. 450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాలువ లైనింగ్ పనులను చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఈ పనులను మంత్రి పరిశీలించి పురోగతిని సమీక్షించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఎల్‌బీసీ కాలువ ఆధునీకరణ ద్వారా నీటి వృథా అరికట్టబడుతుందని, దీనివల్ల చివరి భూముల వరకు సాగునీరు అంది రైతులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాభివృద్ధి, నీటి వనరుల సమర్థ వినియోగం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను స్పీడప్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
