పుచ్చిపోయిన పప్పు.. పాడైన బెల్లంతో రాములోరి లడ్డూలు

పుచ్చిపోయిన పప్పు.. పాడైన బెల్లంతో రాములోరి లడ్డూలు
  • భద్రాద్రి రామయ్య ప్రసాదాల తయారీలో నిర్లక్ష్యం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పుచ్చిపోయిన పప్పు, పాడైన బెల్లంతో లడ్డూలు తయారు చేశారు. దేవస్థానంలో పచ్చి శనగపప్పును పిండి పట్టించి, బెల్లంతో నిత్యం లడ్డూలు తయారు చేసి ప్రసాదాల కౌంటర్‍కు పంపిస్తారు. వంటశాల పక్కనే ఉండే స్టాక్‍ రూంలో బెల్లం, శనగపప్పు ఉంటుంది. స్టాక్‍ పాయింట్‍కు హైదరాబాద్​నుంచి ప్రతీ నెల నిత్యావసర వస్తువులు వస్తుంటాయి. వాటిని పరిశీలించేందుకు ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ చూసి సంతకాలు చేశాకే స్టాక్‍ దించుకుంటారు. ఇందులో ఎస్పీఎఫ్‍, వైదిక కమిటీ నుంచి ఒకరు, దేవస్థానం ఎంప్లాయ్‍ ఒకరు ఉంటారు. ఇటీవల లాక్​డౌన్​కారణంగా ఆలయం మూసివేసి ఏకాంతంగా పూజలు నిర్వహించారు. భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో దాదాపు 7000 కిలోల వరకు బెల్లం పాడైపోతే తిరిగి పంపించారు. కానీ ఇంకా కొంచెం బెల్లం స్టాక్‍ పాయింట్‍లో ఉంచారు. ఆ బెల్లం ఎలా ఉందో పరిశీలించాల్సిన కమిటీ పట్టించుకోకపోవడంతో వాటితో బుధవారం వెయ్యికి పైగా లడ్డూలు తయారు చేయించారు. కొన్ని లడ్డూలు ప్రసాదాల కౌంటర్‍కు సైతం పంపించారు. 
రామయ్య హుండీ ఆదాయం రూ.66.8 లక్షలు
భద్రాచలం, వెలుగు: సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. రూ.66,80,992 నగదుతోపాటు, 35 గ్రాముల బంగారం, వెండి కిలో, 25 అమెరికన్‍ డాలర్లు, 10 పాకిస్తానీ రూపీలు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 40 యూరప్‍ యూరోలు, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 250 యూఏఈ దీరామ్‍లు వచ్చాయి. చివరిసారిగా మార్చి 25న హుండీలు లెక్కించారు.

విచారణ చేస్తాం
బెల్లం, శనగపప్పు నాణ్యతపై విచారణ చేస్తాం. వీటిని పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం. లాక్​డౌన్ సమయంలో కొంత బెల్లం పాడైపోతే రిటర్న్ చేశాం. అయినా ఈ బెల్లం, పప్పు ఎలా వచ్చిందో తెలుసుకుంటాం. లడ్డూల తయారీ ఆపేస్తాం. - శివాజీ, ఈవో