
ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. 2025, అక్టోబర్ 3వ తేదీన సచివాలయంలో మలేషియా ప్రతినిధుల బృందంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు, పెట్టుబడులపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నట్లు వివరించారు మంత్రి.
దేశంలోనే టాప్ 5 రాజధాని నగరాల్లో అమరావతి ఒకటి అని.. ఆ దిశగానే నిర్మాణాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మలేషియా ప్రతినిధులకు వివరించారు మంత్రి నారాయణ. అమరావతి విజన్ పరిశీలించిన మలేషియా ప్రతినిధులు.. రాబోయే రెండేళ్లల్లో 6 వేల నుంచి 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను సైతం స్వయంగా పరిశీలించారు మలేషియా ప్రతినిధులు.
అమరావతి కేంద్రంగా అంతర్జాతీయ విమానాశ్రయం.. అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఇలా అన్ని రాబోతున్నాయని.. రాబోయే మూడేళ్లల్లో అమరావతి మహా నగరంగా మారనున్నట్లు వివరించారు మంత్రి నారాయణ. అమరావతి విజన్ డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత.. స్వయంగా చూసిన తర్వాత మలేషియా ప్రతినిధులు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.