- మూడు రోజులు ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ
- జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్
మల్కాజిగిరి, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో (044) ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ శాఖలు, పారిశుధ్య, మలేరియా, హార్టికల్చర్, వెటర్నరీ విభాగాల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓటు వివరాల మ్యాపింగ్, ఫ్రీజింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధవారం మల్కాజిగిరి జోనల్ ఆఫీసులో దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..18 ఏండ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయడం, కుటుంబసభ్యుల పేర్లను ఒకే పోలింగ్ కేంద్రం, ఒకే బూత్‌కు లింక్‌చేయడం, ఓటరు జాబితాకు అనుగుణంగా వివరాలను మ్యాపింగ్ చేసి ఫ్రీజ్ చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు.
ముందుగా ప్రభుత్వ, మున్సిపల్ విభాగాల ఉద్యోగులతో ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఉద్యోగులందరూ సహకరించి వివరాలను సరిచూసుకొని మ్యాపింగ్, ఫ్రీజింగ్ చేయించుకోవాలని సూచించారు. అలాగే, నియోజకవర్గ ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించేందుకు కాలేజీలు, రేషన్‌షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏఈఆర్‌వో దయానంద్, చింత శ్రీనివాస్, నిర్మల, శ్రవణ్, గురుభూషణ్, అబ్దుల్ పాల్గొన్నారు.

