మల్లన్నసాగర్ పంప్ హౌస్ పనుల్లో వేగం పెంచండి..వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు ఎండీ ఆదేశం

మల్లన్నసాగర్ పంప్ హౌస్ పనుల్లో వేగం పెంచండి..వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు ఎండీ ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద నిర్మాణంలో ఉన్న రా వాటర్ పంప్ హౌస్​పనుల్లో వేగం పెంచాలని వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ పంప్​హౌస్​ను ఆయన సందర్శించారు. నగరానికి 20 టీఎంసీల అదనపు నీటి సరఫరా, మూసీ పునరుజ్జీవనం, జంట జలాశయాలను నింపడం కోసం రూ.7,360 కోట్లతో చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3లో ఈ పంప్ హౌస్ కీలకం.

ఈ పంప్ హౌస్ నుంచి ఘనపూర్ వరకు 50 కి.మీ. దూరంలో రెండు వరుసల 3000 ఎంఎం డయా పైప్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఘనపూర్ మాస్టర్ రిజర్వాయర్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్​లో రా వాటర్ శుద్ధి చేసి నగరానికి సరఫరా చేయనున్నారు. గజ్వేల్ మండలం పాతూరు గ్రామ సమీపంలో పైప్ లైన్ పనులను కూడా ఆయన పరిశీలించారు.  ప్రతి పైపుకు యూనిక్ నెంబర్ కేటాయించి జియో ట్యాగ్ చేయాలని, దీనికోసం ఐటీ విభాగం సాయంతో ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాలని ఆదేశించారు. పైపు జాయింట్ల పటిష్టతను అల్ట్రా సోనిక్ టెస్ట్ పరికరంతో పరీక్షించి సంతృప్తి చెందారు.