వాళ్లు విప్లవ ద్రోహులు.!..మల్లోజుల, ఆశన్నను మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నం

వాళ్లు విప్లవ ద్రోహులు.!..మల్లోజుల, ఆశన్నను మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నం
  •     మల్లోజుల, ఆశన్నను మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నం
  •     పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్​ పేరిట లేఖ


హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ముందు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్​అలియాస్​ సోనూ, చత్తీస్​ గఢ్ డీజీపీ ముందు లొంగిపోయిన తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్​ ఆశన్న విప్లవ ద్రోహులని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన 150కి పైగా ఆయుధాలను పోలీసులకు అప్పగిస్తూ లొంగిపోయిన విధానాన్ని తప్పుపపడుతూ.. వారిని పోలీస్​ కోవర్టులుగా పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి అభయ్​ పేరిట లేఖ విడుదలైంది. వారి లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్చిన్నకర చర్య, విప్లవ ప్రతిఘాతకత అని లేఖలో పేర్కొన్నారు. వారిని మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని.. విప్లవ ప్రజల చేతిలో వారికి శిక్ష తప్పదని హెచ్చరించింది. వారిద్దరినీ నమ్మి పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులు వెనక్కి వచ్చేయాలని.. వారికి పార్టీ తరఫున ఏం కాదని హామీ ఇచ్చారు. ఇక మీదట లొంగిపోయే మావోయిస్టులు ఆయుధాలను పార్టీకి అప్పగించి పోలీసులకు లొంగిపోవొచ్చని సూచించారు.

పార్టీని చీల్చేందుకు సోనూ కుట్ర..
  
సోనూ గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీ కమిటీ, సభ్యులతో, పీఎల్‌జీఏ సభ్యులతో చర్చించి పార్టీని చీల్చే కుట్రకు పూనుకున్నాడని లేఖలో  పేర్కొన్నారు. ‘‘ఎందరో కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి.. ప్రాణాలర్పించి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని శత్రువుకు అప్పగించడమంటే విప్లవ కారులను హత్య చేయడానికి, హత్య చేయమని ప్రోత్సహించినట్టే. దీనిని కౌంటర్​ రెవెల్యూషనరీ అంటారు’’అని వెల్లడించారు. సోనూ, అతనితో కలిసి శత్రువుకు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, ప్రత్యమ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీకమిటీ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇన్​చార్జి ఆశన్న, ముగ్గురు డీ ఎస్ జెడ్ సీ ఎంలు సంతూ, భాస్కర్ (రాజ్ మన్), రనీత.. సోనూలాగే పార్టీ విచ్ఛిన్నకర శక్తులుగా మారిపోయారని పేర్కొన్నారు. ఆశన్న గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, చత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసులు, ఆ రాష్ట్ర మంత్రితో సంబంధాల్లో ఉంటూ కోవర్టుగా వ్యవహరించినట్టుగా అర్థమవుతోందని లెటర్​లో పేర్కొన్నారు. 

వారి పోరాటాలు విలువ లేనివి

విప్లవానికి ద్రోహులుగా మారిన వేణుగోపాల్, ఆశన్న ముఠా సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని పునర్నిర్మిస్తామనడం బూటకమని లేఖలో పేర్కొన్నారు. ‘‘వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలకు విలువ లేదు. ఈ విప్లవ ద్రోహులు ప్రజా పోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. వారి విప్లవ ద్రోహాన్ని ఇప్పటికైనా, ఇక ముందైనా అర్థం చేసుకుని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా లొంగిపోయిన ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు, పీఎల్​జీఏ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీని చీలదీసే విప్లవ ప్రతిఘాతక కార్యకలాపాలను ఇకనైనా ఆపివేయాలని సోనూ, ఆశన్నను హెచ్చరిస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.