సోనియాతో మమతా బెనర్జీ భేటీ

సోనియాతో మమతా బెనర్జీ భేటీ
  • సోనియా, రాహుల్ గాంధీలతో మమత ముఖాముఖి 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 10 జన్ పథ్ లోని సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది. రాహుల్ గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.  ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిన మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ నేతగా తానే బాధ్యతలు చేపట్టే కీలక నిర్ణయం తీసుకున్నారు. 
జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలన్న నిర్ణయం అమలులో భాగంగా నిన్నటి నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ  నిన్న ప్రధాని మోడీతోపాటు పలువురు ముఖ్య నేతలు, మేధావులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ నేరుగా సోనియా, రాహుల్ గాంధీలతో అంతర్గత చర్చలకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో బలమైన మెజారిటీతో దేశ రాజకీయాల్లో అన్ని ప్రాంతాలకు చొచ్చుకుని వెళ్తున్న బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాల తరపున ప్రతిపాదన తరచూ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనే అంశంపై ప్రధానంగా చర్చించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సోనియా, రాహుల్‌ గాంధీలతోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించిట్లు ఊహాగానాలు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ సోనియా, రాహుల్ లతో సమావేశం కావడం దేశ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.