బీజేపీని గద్దె దించేదాకా ఫైట్ చేస్త..మమతా బెనర్జీ ప్రతిజ్ఞ

బీజేపీని గద్దె దించేదాకా ఫైట్ చేస్త..మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
  • పాల్గొన్న ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు

కోల్‌‌‌‌కతా: బీజేపీని అధికారంలోంచి దించేదాకా వదిలిపెట్టబోనని బెంగాల్‌‌‌‌ మాజీ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. మంగళవారం కోల్‌‌‌‌కతాలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోరాడుతాం లేదా చనిపోతాం అని ఆమె ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటిదాకా తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నేతలపై దాడులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మమత ఆరోపించారు. 

ఇటీవల తన మేనళ్లుడు అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడిగుడ్లతో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ఆ రోజు రాయి అభిషేక్ తలకు తగిలి ఉంటే ప్రాణమే పోయేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీతో అధికారాన్ని చేపట్టి, ఎమ్మెల్యేలను.. కౌన్సిలర్లను బెదిరిస్తూ టీఎంసీని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతున్నారని మమత ఆరోపించారు. పార్టీ కార్యకలాపాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. మైక్ పెట్టుకోవడానికి అనుమతించక, వేదిక ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించకుండా వేధింపులకు పాల్పడుతోందన్నారు.

టీఎంసీలో అంతర్గత సంక్షోభం?

మమత నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముగ్గురు ఎంపీలు మాత్రమే ఆమెకు మద్దతుగా ధర్నాకు వచ్చారు. దీంతో టీఎంసీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా సోవందేబ్ చటోపాధ్యాయ్ ఎంపికకు మద్దతుగా సమర్పించిన లేఖలో కొందరు ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. 

మరోవైపు, మమత నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇప్పటికే వంద మందికిపైగా కౌన్సిలర్లు పార్టీని వీడినట్లు తెలుస్తోంది. పలువురు ఎంపీలు కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక పదవులకు రిజైన్ చేశారు. అభిషేక్​పై కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.