- బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పడంతో ఇంట్లో బంగారం దొంగిలించి ఇచ్చిన యువతి
- అమ్ముకుని సొమ్ము చేసుకున్న నిందితుడు
దిల్ సుఖ్ నగర్, వెలుగు: అతడికి పెండ్లయ్యింది. ఒక పాప సంతానం. ఈ విషయం తెలిసి కూడా ఓ యువతి తన తండ్రి షాపులో పనిచేసే ఆ యువకుడితో ప్రేమలో పడింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ అని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని అతడు చెప్పిన కథలకు కరిగిపోయింది. అతడిని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ఏకంగా తన ఇంట్లోనే కిలో బంగారం దొంగిలించి ఇచ్చింది.
ఆ బంగారాన్ని అమ్ముకున్న అతడు తన అప్పులన్నీ తీర్చేశాడు. తన సమస్యలన్నీ తీర్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. మిగిలిన డబ్బులతో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు ఇటీవలే గుజరాత్లోని తమ స్వగ్రామం వెళ్లడానికి ఇంట్లో బంగారు నగలు చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అతడికి 34.. ఆమెకు 20
చైతన్యపురి పరిధిలో ఉండే ఓ వ్యాపారికి నగరంలో టైల్స్ దుకాణం ఉంది. ఆ షాపులో సాగర్ (34) నాలుగేండ్లుగా మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇంట్లో మనిషిగా కలిసిపోయిన అతను.. ఓనర్ కూతురిపై కన్నేశాడు. ఆమెతో స్నేహం పెంచుకుని క్రమంగా దగ్గరయ్యాడు. మన షాపులో పనిచేసే వ్యక్తే కదా అని నమ్మిన ఓనర్ ఏమీ పట్టించుకోలేదు. ఓనర్ కూతురు తనను ప్రేమించడం మొదలుపెట్టిందని తెలుసుకున్న సాగర్.. తనకు బ్రెయిన్ట్యూమర్ ఉందని ఆమెకు కట్టుకథలు చెప్పాడు. రోజూ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నానని నమ్మబలికాడు. అతడి పరిస్థితిని చూసి జాలిపడిన ఆమె.. తన ఇంట్లోని లాకర్లో దాచి ఉంచిన కిలో బంగారం దొంగిలించి అతడికి ఇచ్చింది. సాగర్ ఆ బంగారాన్ని అమ్మగా సుమారు రూ.70 లక్షలకుపైగా నగదు వచ్చింది. వాటితో తన అప్పులన్నీ తీర్చేశాడు.
మరికొంత డబ్బుతో బ్రాండెడ్ బట్టలు, ఇతర వస్తువులు కొన్నాడు. మిగిలిన డబ్బులతో ఏం చేయాలా అని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే యువతి కుటుంబ సభ్యులు గుజరాత్ లోని స్వగ్రామం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారం చూడగా కనిపించలేదు. దీంతో చైతన్యపురి పోలీసులకు ఈనెల 17 న ఫిర్యాదు చేశారు. అదేరోజు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా ఓనర్ కూతురిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా అసలు విషయం చెప్పింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 20 తులాల బంగారం రికవరీ చేశారు.

