V6 News

నాన్నా.. లే.. నాన్నా..! యాజమాన్యం వేధింపులతో వ్యక్తి మృతి... కంటతడి పెట్టించిన చిన్నారుల రోదన

నాన్నా.. లే.. నాన్నా..! యాజమాన్యం వేధింపులతో వ్యక్తి మృతి... కంటతడి పెట్టించిన చిన్నారుల రోదన

పంజాగుట్ట, వెలుగు: పని ఒత్తిడి, యాజమాన్యం వేధింపుల కారణంగా  ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్​పేటకు చెందిన ఎద్దుల సత్యనారాయణ (45)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉండగా, ఏడాది కాలంగా ఎర్రమంజిల్​లోని గెలిరియా షాపింగ్​మాల్​లో హౌస్​కీపింగ్ సూపర్ వైజర్​గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉండగా, మేనేజర్ ఫోన్ చేసి విధులకు రావాలని ఒత్తిడి చేయడంతో రాత్రి డ్యూటీకి వెళ్లాడు. 

అర్ధరాత్రి సమయంలో సత్యనారాయణకు వాంతులు, విరేచనాలు కాగా, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్వహకులు అతడిని రోడ్డు పక్కన పడుకోబెట్టి వెళ్లిపోయారని ఆయన భార్య కల్పన కన్నీరుమున్నీరైంది. తనకు ఉదయం ఫోన్ వస్తే మాల్​కు చేరుకున్నానని, సీసీ కెమెరాలు పరిశీలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయని వేడుకుంది. మృతదేహం వద్ద ‘నాన్నా.. లే..’ అంటూ పిల్లలు ఏడ్చిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

సీఐటీయూ ఆందోళన

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మాల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి మృతదేహంతో నిరసన తెలిపినా యాజమాన్యం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మేనేజర్ నిఖిల్ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.