కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో దగా... 40 మందికి టోకరా, నిందితుడి అరెస్ట్

కలెక్టర్  సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో దగా... 40 మందికి టోకరా, నిందితుడి అరెస్ట్

హనుమకొండ, వెలుగు: వరంగల్  కలెక్టర్​ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిని సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్  చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో ఫేక్​ అపాయింట్ మెంట్  లెటర్స్, సర్వీస్​ బుక్స్  స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు సుబేదారి పీఎస్​లో వివరాలు వెల్లడించారు. వరంగల్  రామన్నపేటకు చెందిన మంద శ్రీనివాస్​  జీడబ్ల్యూఎంసీలో జవాన్​గా పని చేసి హార్ట్​ స్ట్రోక్ తో చనిపోయాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని ఆయన కొడుకు మంద కల్యాణ్​కు ఇవ్వగా, 2019 నుంచి 2024 వరకు జవాన్​గా పని చేశాడు. 

ఉద్యోగంలో వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడం, ఈజీ మనీకి అలవాటుపడిన కల్యాణ్​  ఉద్యోగాల పేరుతో మోసానికి తెరలేపాడు. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారిని ఎంచుకుని, తనకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని, కలెక్టర్​ ఆఫీస్​ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అనంతరం వరంగల్  కలెక్టర్​ సత్యశారద సంతకాన్ని ఫోర్జరీ చేసి అపాయింట్ మెంట్ ఆర్డర్స్​ ఇచ్చేవాడు. వారి పేరుతో నకిలీ సర్వీస్​ బుక్స్ కూడా తయారు చేసేవాడు. 

తనకు తెలిసిన కూరపాటి భవ్య కిరణ్, మంద వంశీలతో కలిసి 40 మంది నుంచి రూ.16.14 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం తెలిసిన ఆర్డీవో ఈ నెల 21న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు సోమవారం మంద కల్యాణ్ ను అరెస్ట్​ చేసి, 39 సర్వీస్  బుక్స్, 23 ఫేక్  అపాయింట్​మెంట్ లెటర్లు, కారు, బైక్, కలర్​ టీవీ, మొబైల్ ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.