
- ముఠాలోని నలుగురు అరెస్టు
- రూ. 28.50 లక్షలు రికవరీ
ఎల్బీ నగర్, వెలుగు: రూ. 29 లక్షల దారి దోపిడీ కేసులో నలుగురు నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు గురువారం తన ఆఫీస్‌లో ఈ కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ జకీర్ తన కొడుకు ఇలియాస్ సూచనతో సిటీ శివారులో ప్లాట్ కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. ప్లాట్ కొనుగోలు కోసం తన అల్లుడు కబీర్‌కు రూ. 29 లక్షలు అందజేయాలని అనుకున్నాడు.
అయితే, కబీర్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో తన ఫ్రెండ్ఎర్రకుంటకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్‌కు ఇలియాస్ ఈ నెల 21న రాత్రి డబ్బులు ఇచ్చాడు. అయితే, ఖాదర్తన మామ ముంతాజ్ భాగ్‌కు చెందిన హబీద్ హరూన్, చాంద్రాయణగుట్టకు చెందిన వర్ధన్, కాటేదాన్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రసికాంత్ బర్దన్ అలియాస్ కిట్టు, రషీద్ ఖాన్కలిసి ఈ డబ్బులను దారి దోపిడీ చేయించాడు.
అనంతరం దోపిడీలో పాల్గొన్న వారి నుంచి డబ్బులు తీసుకొని, ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున అందజేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అబ్దుల్ ఖాదర్, హబీద్ హరూన్, వర్ధన్, రసికాంత్ బర్దన్లను గురువారం అరెస్టు చేసి, రూ.28. 50 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు రషీద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.