సింగరేణిలో 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు..గతంతో పోలిస్తే ఇదే అతి తక్కువ స్టాక్

సింగరేణిలో 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు..గతంతో పోలిస్తే ఇదే అతి తక్కువ స్టాక్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలోని గనులు, సీహెచ్ పీల్లో ఈనెల 4 వరకు 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని యాజమాన్యం శనివారం  ప్రకటించింది. గత పదేండ్ల చరిత్రలో అత్యల్ప స్టాక్ ఇదేనని పేర్కొంది. స్టాక్ గా ఉన్న బొగ్గును ఎప్పటికప్పుడు రైలు, రోడ్డు మార్గం ద్వారా అవసరమైన వినియోగదారులకు రవాణా చేయనున్నట్లు తెలిపింది. సింగరేణి బొగ్గు అంశంపై ఇటీవల కేటీఆర్ చేసిన ఆరోపణలు సింగరేణి సంస్థ కౌంటర్ ఇచ్చింది.

 సింగరేణిలో డిపెండెంట్, కారుణ్య నియామకాల కోసం మెడికల్ బోర్డును కొనసాగిస్తామని పేర్కొంది. గతంలో జరిగిన అవకతవకలపై సీబీకి కంప్లైంట్ ఇచ్చామని, విచారణలో ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది. నైనీ బొగ్గు బ్లాక్​ టెండర్లకు సంబంధించి సైట్ విజిట్ అంశంపై ఇదివరకే సంస్థ తరఫున అధికారికంగా వివరాలు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది. ‘‘సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కేవలం సింగరేణిలోనే కాదు.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా అమలులో ఉంది.

సింగరేణిలో మే 2025 నుంచి ఓవర్ బర్డెన్ టెండర్లకు సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను ప్రవేశపెట్టినం. శ్రీరాంపూర్ ఓసీ-–2 ప్రాజెక్టు,  శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే ఓసీలో సైట్​ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను కాంట్రాక్ట్ సంస్థ మధ్యలో వదిలేయడం వల్ల కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలకు విఘాతం కలిగింది’’ అని సింగరేణి సంస్థ వెల్లడించింది.