- జులై 15 వరకు అప్లికేషన్లు
- 30% మేనేజ్‌మెంట్, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి చర్యలు
- బీ- కేటగిరీ అడ్మిషన్ల గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ
- అందుబాటులో 32,387
- మేనేజ్మెంట్ కోటా సీట్లు
- 30% మేనేజ్‌మెంట్, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి చర్యలు
- బీ- కేటగిరీ అడ్మిషన్ల గైడ్‌లైన్స్
- రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ
- అందుబాటులో 32,387 మేనేజ్మెంట్ కోటా సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ మైనారిటీ, నాన్-మైనారిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా (బీ -కేటగిరీ) సీట్ల భర్తీకి షెడ్యూల్ ఖరారైంది. 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లతోపాటు 15 శాతం సూపర్ న్యూమరరీ కింద ఎన్ఆర్ఐ కోటా సీట్లను భర్తీ చేసేందుకు బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈనెల 29 నుంచి కాలేజీలు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జులై 15 వరకు విద్యార్థుల నుంచి సీట్ల కోసం దరఖాస్తులను తీసుకోవాలని సూచించింది. 28 లో గా ఈప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. అడ్మిషన్ల ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ వెబ్ సైట్ ద్వారా షెడ్యూల్ రిలీజ్ చేశారు.
మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ నోటిఫికేషన్ ను ప్రతి కాలేజీ యాజమాన్యం కనీసం మూడు ప్రధాన దినపత్రికల్లో (తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ) నోటిఫికేషన్ ఇవ్వాలని టీజీసీహెచ్ఈ స్పష్టం చేసింది. దీనిలో బ్రాంచ్‌ల వారీగా అందుబాటులో ఉన్న సీట్లు, ట్యూషన్ ఫీజు, దరఖాస్తు విధానం, అప్లికేషన్ సమర్పించాల్సిన చివరి తేదీ వంటి వివరాలన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (ఇన్-పర్సన్) పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వెబ్‌సైట్ వివరాలను అందుబాటులో ఉంచాలని కౌన్సిల్ సూచించింది.
భర్తీ ఇలా చేయాలి
ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లను, ఎన్ఆర్ఐ కోటాలో మిగిలిన సీట్లను మొదట జేఈఈ మెయిన్స్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత టీజీఈఏపీసెట్ ర్యాంకుకు అవకాశం ఇవ్వాలి. ఈ రెండు కేటగిరీల తర్వాత కూడా సీట్లు మిగిలితే ఇంటర్ మార్కుల మెరిట్ కనీసం 45% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీకి 40% మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని కౌన్సిల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఆర్ఐ సీట్లు ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికే ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని సూచించింది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లలో కాలేజీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని టీజీసీహెచ్ఈ హెచ్చరించింది. అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను, ఒరిజినల్ సర్టిఫికెట్లను గడువులోగా కౌన్సిల్ కు సమర్పించి ఆమోదం పొందాలని తెలిపింది. అడ్మిషన్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలే బాధ్యత వహించాలని, జులై 29లోగా వివరాలు అందించాలని సూచించింది. ఆగస్టు 5 వరకు ఒక్కో అభ్యర్థికి రూ.3 వేల ఫైన్‌తో కలిపి మొత్తం రూ.4 వేలు చెల్లించి అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంది.
