మంచిర్యాల డీఈవోగా లలితకు నో చాన్స్...ఆమె పనితీరుపై ఉన్నతాధికారుల అసంతృప్తి

మంచిర్యాల డీఈవోగా లలితకు నో చాన్స్...ఆమె పనితీరుపై ఉన్నతాధికారుల అసంతృప్తి
  •     బాధ్యతలు చేపట్టినా చార్జ్​ ఇవ్వలే..
  •     ఏసీఎల్​బీ చంద్రయ్యకే అదనపు బాధ్యతలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎన్.లలితకు నిరాశే ఎదురైంది. ఆమె పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉండడంతో డీఈవోగా చార్జి అప్పగించడానికి ఒప్పుకోలేదు. లోకల్ ​బాడీస్​అడిషనల్ కలెక్టర్ ​పి.చంద్రయ్యకే అదనపు బాధ్యతలను కలెక్టర్​ కుమార్​ దీపక్​ అప్పగించారు. దీంతో లలిత అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గానే కొనసాగుతున్నారు. ఇంతకుముందు డీఈవోగా పనిచేసిన యాదయ్య ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో హైదరాబాద్​కు ట్రాన్స్​ఫర్​ కావడం తెలిసిందే. ఆయన స్థానంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ ​ఇన్​చార్జి డీఈవోగా పనిచేస్తున్న లలితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆర్డర్స్​ జారీ చేశారు. 

ఈమేరకు ఆమె గత శుక్రవారం మంచిర్యాల డీఈవో ఆఫీస్​లో బాధ్యతలు చేపట్టారు. తనకు చార్జి అప్పగిస్తారని ఎదురుచూసినప్పటికీ అందుకు కలెక్టర్​ ఒప్పుకోలేదని సమాచారం. గతంలో కరీంనగర్​ డీఈవో ఆఫీసులో సూపరింటెండెంట్​గా పనిచేసిన లలిత ఏడాది కిందట అసిస్టెంట్ ​డైరెక్టర్(ఏడీ)గా ప్రమోషన్​పై మంచిర్యాలకు వచ్చారు. మార్చిలో కుమ్రం భీం​ ఆసిఫాబాద్​ డీఈవో పోస్టు ఖాళీ కావడంతో ఆమెను ఇన్​చార్జిగా నియమించారు. కరీంనగర్​లో నివాసముంటున్న లలిత రోజూ మంచిర్యాల, ఆసిఫాబాద్​కు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 11 తర్వాత రావడం, మధ్యాహ్నం 3గంటలకే వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేగాకుండా మంచిర్యాల జిల్లాలో ఆశ్రమ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే ఒక్కరోజు కూడా స్కూళ్లకు వెళ్లకపోవడం ఆమె పనితీరుపై అసంతృప్తిని మరింత పెంచింది. దీంతో ఆమెకు డీఈవోగా వచ్చిన చాన్స్​ మిస్సయింది.