మంచిర్యాల, వెలుగు: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన 11 మంది రైతులు మూడేండ్ల క్రితం డీడీలు కట్టినా ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో సోమవారం ఐడీవోసీలో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 2023 ఫిబ్రవరి 14న 11 మంది రైతులం రూ.5295 చొప్పున డీడీలు తీసి అప్పటి ఏఈఈ మల్లయ్యకు అందజేశాం. ఆయన కాలయాపన చేయడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. దీంతో 2024లో కొన్ని సిమెంట్ పోల్స్ వేసినా కరెంట్ లైన్ వేయలేదు. లైన్ లేకపోవడంతో పోల్స్ పక్కకు ఒరిగిపోయాయి.
మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మళ్లీ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఏఈఈ మల్లయ్య ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి పెట్టాడు. కానీ మిలిగిన పోల్స్ వేయలేదు. డ్యామేజ్ పోల్స్ సరిచేయలేదు. కరెంట్ లైన్ గుంజకుండానే వదిలేశాడు. దీంతో మళ్లీ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఏఈఈ మల్లయ్య విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా అవినీతికి పాల్పడుతున్నట్టు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు వచ్చిన ఏఈఈలు ఎవరూ మా గోడు పట్టించుకోలేదు” అని వాపోయారు. ఆ పనులతో తమకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారని, కలెక్టర్ స్పందించి తమకు కరెంట్ లైన్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
