- ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ
జైపూర్, వెలుగు: ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని బిడ్డ పుట్టాక మొహం చాటేశాడని ఆరోపిస్తూ ఓ యువతి కానిస్టేబుల్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన కురిసింగ నీలిమ, అదే గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సోతుకు సాయిరాజ్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. నీలిమ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది.
కొడుకు పుట్టిన విషయాన్ని సాయిరాజ్‌కు తెలియజేయగా, అతడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు నీలిమ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసినట్లు ఆరోపించారు. శుక్రవారం నీలిమ తన కుటుంబ సభ్యులతో కలిసి సాయిరాజ్ ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఈ ఘటనపై జైపూర్ ఎస్సై రాజశేఖర్‌ను సంప్రదించగా ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

