దేశంలో అంటరానితనం పోలేదు

దేశంలో అంటరానితనం పోలేదు

దేశానికి  స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇంకా అంటరానితనం పోలేదని  ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రాజస్థాన్‌లో 9 ఏండ్ల ఇందర్ కుమార్ మేఘ్‌వాల్ హత్యే నిదర్శనమన్నారు.3వ తరగతి చదువుతున్న ఇందర్ కుమార్ కుండలో నీటిని తాగినందుకు టీచర్ చితకబాదింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. దీనిపై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దళితులు, పేదలకు ఇంకా రాలేదన్నారు. కనీసం మంచినీళ్లు కూడా తాగే స్వేచ్ఛ లేదని ఈ ఘటనే నిరూపిస్తోందన్నారు.

ఈ హత్యను నిరసిస్తూ నేటి నుంచి ఈనెల 22 వరకు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని మందకృష్ణ మాదిగ తెలిపారు. దేశంలోని అన్ని గ్రామాల్లో ఇందర్ కుమార్‌కు నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి మోడీ ఈ హత్యను ఖండించకపోవడం బాధాకరమన్నారు. రానున్న 25 ఏండ్ల ప్రణాళికలో అంటరానితనం నిర్మూలనను చేర్చకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. రాజ్యాంగంలో ఉన్న కులవివక్ష నిర్మూలన అంశం పుస్తకాలకే పరిమితమైందన్నారు. దీనిపై పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి రాజస్థాన్ ఘటనే నిదర్శనమన్నారు.