మన చరిత్రను చెప్పే ముచ్చట్లు

మన చరిత్రను చెప్పే ముచ్చట్లు

ప్రతి ఒక్కరికీ సొంతూరిపై ఎంతో ప్రేమ ఉంటుంది. పుట్టి పెరిగిన ఇల్లు, ఊళ్లోని మనుషులు, వీధులు, పొలాలు, చెరువులు.. ఒక్కటేమిటి? గ్రామంతో సంబంధం ఉన్న అన్నింటితోనూ అనుబంధం ఉంటుంది. ఆ అనుభవాలు, జ్క్షాపకాల గురించి పదిమందితో పంచుకోవాలనిపిస్తుంది. రచయిత, కవి తుమ్మూరి రాంమోహన్ ​రావుకు వచ్చిన అలాంటి ఆలోచన ఎన్నో చారిత్రక సంగతులను మన ముందు ఉంచింది. ఎందుకంటే ఆయన పుట్టింది వెలగందుల (ఎలగందుల)లో. కరీంనగర్​కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెయ్యేండ్ల చరిత్ర ఉంది. అలాంటి తన సొంతూరి గురించి ఫేస్​బుక్​లో ఆయన రాసిన వ్యాసాలు ‘మానేరు ముచ్చట్లు–వెయ్యేండ్ల వెలగందుల చరిత్ర’ పుస్తకమైంది. ఇందులో కేవలం ఒక ఊరి ముచ్చట్లు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే. మన తెలంగాణ చరిత్రతో ముడిపడి ఉన్న అనేక అంశాలు కూడా కనిపిస్తాయి. సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల వంటి తొమ్మిది తాలూకాలతో ఏర్పడిన సబ్బిసాయిరం(ఇప్పటి కరీంనగర్​) జిల్లాకు ఒకప్పుడు కేంద్రంగా వెలిగింది ఎలగందుల.

ఇది 10వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో ఉన్నట్లు దొరికిన శాసనం ఈ గ్రామం ప్రస్థానాన్ని చెప్పే రుజువు. ఒక చిన్న ఊరుగా మొదలై జిల్లా కేంద్రంగా ఎదిగి, చివరికి మళ్లీ ఒక గ్రామంగా మిగిలిపోయిన సంగతుల్ని ‘మానేరు ముచ్చట్లు’ సాక్ష్యాలతో సహా మనకు చెప్తుంది. దానికోసం ఎన్నో శాసనాలు పరిశీలించి, చరిత్రకారులను కలిసి సేకరించిన విషయాలను చెప్పారు రచయిత. వెలగందులలో రాచరిక పాలన ఎలా మొదలైంది? ఎవరెవరు పాలించారు? ఎవరి కాలంలో ఎలా ఉంది? ఆయా కాలాల్లోని కవులు, కావ్యాల సమాచారం లాంటివన్నీ కనిపిస్తాయి. అలాగే ఊళ్లోని కోట, కోటలోని బావి, నరసింహుని ఆలయం, కమాన్​, దో మినార్​ విశేషాలు తెలుసుకోవచ్చు. మానేరు డ్యాం రాకముందు, ఆ తర్వాత గ్రామం రూపురేఖలు ఎలా ఉన్నాయి అనే విషయాలు, వాటిని బలపర్చే కొన్ని ఫొటోలు పుస్తకంలో కనిపిస్తాయి. వెలగందుల పేరు ఎలా వచ్చింది? కరీంనగర్​ నుంచి వేములవాడ, సిరిసిల్లకు వెళ్లే హైవే మొదట ఏ మార్గంలో ఉండేది? చుట్టుపక్కల పల్లెల సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అయితే, పుస్తకంలోని కొన్ని విషయాలను బలపరిచే ఆధారాలపై స్పష్టత లేదు. అలాంటి వాటి విషయంలో చరిత్ర పరిశోధకులే నిజాల్ని వెలికితీయాలని కూడా రచయిత విజ్క్షప్తి చేశారు. భాష, శైలి బాగున్నా వచ్చిన విషయాలే మళ్లీ వస్తున్నట్లు కనిపిస్తుంది. చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, పరిశోధకులకు ఈ పుస్తకం ఉపయుక్తం. –సాయిప్రేమ్​