- ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రాష్ట్రంలోనే శిక్షణ
- జర్మన్ ఇండస్ట్రియల్ అవసరాలకు
- తగ్గట్టుగా ‘మాస్టర్ ట్రైనర్’
- హెల్త్‌కేర్, ఇంజినీరింగ్,
- ఒకేషనల్ ట్రేడ్స్‌లో ఉపాధి అవకాశాలు
- భారత రాయబారి అజిత్ గుప్తాతో
- మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తెలంగాణ బిడ్డల నైపుణ్యాలను తీర్చిదిద్ది జర్మనీలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బెర్లిన్ వేదికగా కీలక చర్చలు జరిగాయి. రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం బెర్లిన్‌లో భారత రాయబారి అజిత్ గుప్తాతో భేటీ అయ్యింది.
స్కిల్ మొబిలిటీ పాత్‌వేస్‌ను బలోపేతం చేయడం, జర్మనీలో ఉన్న ప్రవాస భారతీయుల పాత్రను పెంపొందించడం గురించి చర్చించారు. ప్రస్తుతం జర్మనీలో 3.11 లక్షల మందికి పైగా భారతీయులు ఉండగా, అందులో 1.16 లక్షల మంది అక్కడి ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకుంటున్నారని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. జర్మనీలో బ్లూ కాలర్ ఉద్యోగాలు, నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు.
జర్మనీలో ఉపాధి కోసం వెళ్లాలనుకునేవారికి ముందుగానే రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వడం అవసరమని మంత్రి వివేక్ అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రపంచ స్థాయి ల్యాబ్‌లు, అత్యాధునిక స్కిల్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, జర్మన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ‘మాస్టర్ ట్రైనర్’ కార్యక్రమాన్ని ప్రతిపాదించామని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘టామ్‌కామ్’ద్వారా అభ్యర్థుల ఎంపిక, రిక్రూట్‌మెంట్, జర్మన్ భాషా శిక్షణను పక్కాగా ఇప్పిస్తున్నామని, దీనికి ‘పీఎం సేతు’ ప్రోగ్రామ్ మరింత తోడ్పాటునిస్తోందని ప్రతినిధి బృందం రాయబారికి వివరించింది.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతి విధానాలను అజిత్ గుప్తా అభినందించడమే కాకుండా, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వలసలకు రాయబార కార్యాలయం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, వొకేషనల్ ట్రేడ్స్ వంటి విభాగాల్లో రాష్ట్ర యువతకు త్వరలోనే మరిన్ని ఉపాధి ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, రాయబార కార్యాలయ ప్రతినిధి స్టాలిన్ బాబు, టామ్‌కామ్ అధికారులు పాల్గొన్నారు.
