డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌ కేసుల్లో.. వెహికల్ సీజ్ చేయొద్దు: హైకోర్టు

డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌ కేసుల్లో.. వెహికల్ సీజ్ చేయొద్దు: హైకోర్టు
  • పోలీసులకు గైడ్ లైన్స్ జారీ చేసిన హైకోర్టు
  • పోలీసులకు హైకోర్టు గైడ్​లైన్స్
  • మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వెంట తాగని వ్యక్తి ఉంటే.. వెహికల్ అప్పగించాలి
  • లేదంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుని, తర్వాత డాక్యుమెంట్లు చెక్ చేసి విడిచిపెట్టాలి 
  • ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు:  డ్రంకెన్ ​డ్రైవ్​​ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడుపుతున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించింది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూషన్‌‌‌‌ చేయాల్సి వస్తే మూడు రోజుల్లో అభియోగ పత్రం దాఖలు చేయాలని తెలిపింది.

2025లో సాయిరాం రావు అనే వ్యక్తి మద్యం తాగి వాహనాన్ని నడుపుతుండగా, ఆ వెహికల్ ను సీజ్‌‌‌‌ చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన జె.విజయ్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌‌‌‌ ఈవీ వేణుగోపాల్‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వాహనాన్ని సీజ్‌‌‌‌ చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వాహనం నడుపుతున్న సాయిరాం రావుపై 4 కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వాహనానికి సంబంధించి చలాన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. 

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి మోటారు వాహనాల చట్టం ప్రకారం తాగి నడుపుతున్నారన్న కారణంగా వాహనాన్ని సీజ్‌‌‌‌ చేసే అధికారం పోలీసులకు లేదని, తగిన పత్రాలు చూపినట్లయితే వాహనాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. 

డ్రంకెన్ ​డ్రైవ్​ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలు, మోటారు వాహనాల చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించిన పోలీసు అధికారి కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

మార్గదర్శకాలు ఇవే..

  • వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తేలితే వాహనం నడపడానికి అనుమతించరాదు. ఒకవేళ వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఉండీ మద్యం మత్తులో లేకుండా, తగిన డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ ఉంటే వాహనాన్ని సీజ్‌‌‌‌ చేయకుండా అతనికి అప్పగించాలి. 
  • ఎవరూ లేకపోతే సంబంధిత పోలీసు అధికారి ఆ వ్యక్తి సమీప బంధువు, స్నేహితులకు సమాచారం అందించి వాహనం తీసుకెళ్లాలని చెప్పాలి.
  • ఒకవేళ ఎవరూ రాకపోతే వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని సమీప పీఎస్​లో భద్రపరచాలి. వాహనాన్ని సీజ్‌‌‌‌ చేసే అధికారం పోలీసులకు లేదు.
  • వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే దాని యజమాని, ధ్రువీకరించిన వ్యక్తి ఆర్‌‌‌‌సీ, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌‌‌‌ల లైసెన్స్‌‌‌‌ చూపితే వాహనాన్ని అప్పగించాలి.
  • వాహన యజమానిని, నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూషన్‌‌‌‌ చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వస్తే సంబంధిత మెజిస్ట్రేట్‌‌‌‌ కోర్టులో మూడు రోజుల్లోగా అభియోగ పత్రం దాఖలు చేయాలి. ప్రాసిక్యూషన్‌‌‌‌ పూర్తయ్యాక వాహనాన్ని విడుదల చేయాలి.
  • వాహనాన్ని స్వాధీనం చేసుకున్న మూడు రోజుల్లోగా సమర్పించే అభియోగ పత్రాలను మెజిస్ట్రేట్‌‌‌‌లు స్వీకరించాలి.
  • పోలీసులు మోటారు వాహన నిబంధనల్లోని 448 ఏను అమలు చేయాలి
  • వాహనాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోతే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు.