- వాటర్ బాటిల్స్, ప్యాకెట్లలో అపరిశుభ్ర నీళ్లు
- హోటల్స్, షాప్స్, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా
- వాటర్ ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, హెచ్ ఫాస్ట్, టాస్క్ ఫోర్స్ దాడులు
- ఐఎస్ఐ, ఫుడ్ లైసెన్స్ లేకుండానే తయారీ
- 40 కన్నా తక్కువగా టీడీఎస్ లెవల్స్
- తనిఖీలు చేసి.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎండాకాలం ప్రారంభం కావడంతో మినరల్ వాటర్ దందా షురూ అయింది. కొందరు వాటర్ప్లాంట్లను పెట్టి.. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా జనాలకు అపరిశుభ్రమైన నీటిని అంటగడుతున్నారు. టీడీఎస్ లెవల్స్ పట్టించుకోకుండా, బోరు నీళ్లను కేవలం ప్యూరిఫై చేసి బాటిల్స్‌లో, ప్యాకెట్లలో నింపి మినరల్ వాటర్ అంటూ అమ్ముతున్నారు.
ఇలా హోటల్స్, రెస్టారెంట్లు, షాపులు, ఇతర చోట్లకు సరఫరా చేస్తున్నారు. అయితే, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకుల పనిపట్టేందుకు అధికారులు దాడులు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ, హెచ్ ఫాస్ట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారం రోజులుగా నగరంలోని పలు ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్న అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆర్వో ప్లాంట్ల పేరుతో దందా
సమ్మర్ లో ఉండే విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్వో ప్లాంట్ పేరుతో నిర్వాహకులు దందా చేస్తున్నారు. అర్హత లేకున్నా బాటిల్స్, ప్యాకెట్లపై ఐఎస్ఐ మార్క్ వేసి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే తయారు చేస్తున్నారు. కొందరు ప్రముఖ కంపెనీల పేర్లలో ఒక ఆల్ఫాబెట్‌ను అటుఇటుగా మార్చి బాటిళ్లను తయారుచేస్తున్నారు. ఇందులో టీడీఎస్ తక్కువగా ఉండే నీటిని నింపి, సిటీలోని ఓపెన్ బార్లు, రెస్టారెంట్లు, వైన్స్ , బస్టాండ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో నగరంలోని చాలా వరకు వాటర్ ప్లాంట్లలో ఎవరికీ ఫుడ్ లైసెన్స్ లేదని, ఐఎస్ఐ స్టాండర్డ్స్పాటించడం లేదని గుర్తించారు. ఇటువంటి ప్లాంట్లే టార్గెట్ గా అధికారులు దాడులు చేస్తున్నారు.
టీడీఎస్ లెవెల్స్ ఇలా ఉండాలి
నీటి నాణ్యతను నిర్ణయించడంలో టీడీఎస్(టోటల్ డిసాల్వుడ్సాలిడ్స్) ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కానీ, వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఎక్కడా టీడీఎస్లెవెల్స్మెయింటెయిన్చేయడం లేదు. డబ్ల్యూహెచ్‌వో, బీఎస్ఐ స్టాండర్డ్స్ప్రకారం టీడీఎస్లెవెల్స్75 నుంచి 500 పీపీఎం వరకు ఉంటే ఆ నీళ్లను తాగొచ్చు. ఈ మధ్యలోనూ కొన్ని లెవెల్స్‌లో తేడాలుంటాయి. 75 నుంచి 150 పీపీఎం వరకు అత్యంత సురక్షితమని, 150 –-300 వరకు మంచిదని, తాగడానికి, వంటకు వాడినా ఇబ్బందులు లేవని చెప్తారు.
ఇక 300 నుంచి -500 వరకు అయితే పర్వాలేదని, తాగితే రుచిలో తేడా తెలుస్తుందంటున్నారు. 500 నుంచి- 1200 మధ్య ఉంటే ఆ నీళ్లను నాణ్యత తక్కువ ఉన్న నీటిగా గుర్తిస్తారు. ఈ నీళ్లు ఉప్పగా లేదా చేదుగా ఉంటాయి. వీటిని ఫిల్టర్ చేసి మాత్రమే తాగాలి. 1200 పైన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లను తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్యాంపిల్స్ ల్యాబ్ కి..
వారం రోజులుగా మినరల్ వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. హెచ్ ఫాస్ట్, టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ పేఫ్టీ అధికారులు పాత బస్తీ ఛత్రినాక పీఎస్పరిధిలోని ఫూల్బాగ్చమన్ లో భవాని ఎంటర్ ప్రైజెస్ గోదాంపై దాడులు చేశారు. వీరు లోకల్ కంపెనీ పేరు పెట్టి స్థానిక షాప్స్ లో అమ్ముతున్నారు. ఇక ఓల్డ్ మలక్‌పేట్‌లో అనుమతులు లేకుండా నడుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్‌పై నా పోలీసులు, ఫుడ్ సేఫ్టీ సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
గ్రీన్ నెస్ట్ వాటర్ పేరుతో ఇక్కడ అపరిశుభ్ర వాతావరణంలో తాగునీరు తయారు చేస్తూ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్లాంట్‌ను సీజ్ చేసి మెషినరీ, స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. కాగా, అక్కడికక్కడే టీడీఎస్ చెక్ చేస్తున్న అధికారులు మిగతా వివరాలు తెలుసుకునేందుకు నీటి శాంపిల్స్‌ను నాచారంలోని ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.
దీని ద్వారా ఆ నీళ్లలో పవర్ ఆఫ్ హైడ్రోజన్ (పీహెచ్) స్థాయి, ఫ్లోరైడ్, క్యాల్షియం, క్లోరైడ్, క్లోరిన్, ఐరన్, నైట్రేట్ వంటి రసాయనాల మోతాదుని తెలుసుకుంటారు. పీహెచ్ 6 నుంచి 8.5 మోతాదులో ఉండాలి. ఫ్లోరైడ్ 1.0 ఎంజీ నుంచి 1.5 ఎంజీల వరకు ఉండొచ్చు. క్లోరైడ్ 250 ఎంజీల లోపు, క్లోరిన్ 4 ఎంజీల కంటే తక్కువ , నైట్రేట్ 45 ఎంజీ లోపు ఉండాల్సి ఉంది.
ఆర్సెనిక్ స్థాయి 0.01 ఎంజీ కంటే తక్కువగా, ఐరన్ 0.3ఎంజీల లోపు ఉండాలి. ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది ల్యాబ్రిపోర్ట్స్లో తెలుస్తాయి. రిపోర్టుల్లో తేడా వస్తే సదరు ప్లాంట్లను శాశ్వతంగా సీజ్ చేయడమే కాకుండా, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
40 కన్నా తక్కువ..
అధికారుల తనిఖీల సందర్భంగా కొన్ని ప్లాంట్ల నుంచి సేకరించిన నీళ్లను అప్పటికప్పుడు మీటర్‌తో తనిఖీ చేయగా టీడీఎస్లెవల్స్ కేవలం 40 మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఈ నీటిలో టీడీఎస్ అతి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అందాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అందవు. వీటిని తాగితే కడుపులో ఆసిడిక్గా మారుతుంది.
ఇందులో శరీరానికి అవసరమైన మినరల్స్ఉండవు. ఎముకల బలహీనపడతాయి. నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. బోర్నీటిని ప్యూరిఫై చేసి ఫిల్టర్ నీళ్లనే మినరల్ అని విక్రయిస్తుండడంతో జనాలు గుడ్డిగా నమ్ముతూ తాగుతున్నారు.
