సమ్మర్ అంటే.. మ్యాంగో సీజనే. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా మిస్ చేస్తారేమో కానీ, మామిడి పండును మాత్రం మిస్సవ్వరు. మన ఇష్టానికి తగ్గట్టే మ్యాంగో టేస్ట్ కూడా అదిరిపోతుంది. కాబట్టి సింపుల్ ఇంగ్రెడియెంట్స్తో టేస్టీ మ్యాంగో రెసిపీలు ఈ వారం స్పెషల్. సో, ఈ సీజన్లో మామిడిని ఇలా కూడా ట్రై చేసి చూడండి.
సార్బెట్:
కావాల్సినవి:
* మామిడికాయ - ఒకటి
* నీళ్లు - అర కప్పు
* తేనె - పావు కప్పు
తయారీ: మామిడికాయ కడిగి, తొక్క తీసి, ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను ఒక బాక్స్‌లో లేదా ట్రేలో పెట్టి మూతపెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత మామిడి ముక్కలను మిక్సీజార్‌లో వేసి వాటితోపాటు నీళ్లు పోసి, తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెడితే చాలు.. ఎంతో రుచికరమైన మ్యాంగో సార్బెట్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మరోలా కూడా చేసుకోవచ్చు. తేనె, నీళ్లు కలపకుండా ఫ్రోజెన్ మామిడి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఒకే ఒక ఇంగ్రెడియంట్తో టేస్టీ సార్బెట్ రెడీ అవుతుంది.
లస్సీ
కావాల్సినవి:
* మ్యాంగో ప్యూరీ - 180 గ్రాములు
* పెరుగు 300 గ్రాములు
* చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
* రోజ్ వాటర్ - రెండు టీస్పూన్లు
* ఐస్ క్యూబ్స్, పిస్తా తరుగు - సరిపడా
తయారీ: ఒక గిన్నెలో పెరుగు వేసి విస్కర్‌తో బాగా బీట్ చేయాలి. తర్వాత అందులో మ్యాంగో ప్యూరీ, చక్కెర, రోజ్ వాటర్, ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరోసారి బీట్ చేయాలి. విస్కర్ లేకపోతే ఈ ఇంగ్రెడియెంట్స్ అన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకుంటే సరి.
రసమలై
కావాల్సినవి:
పాలు - ఒక లీటర్ + రెండు కప్పులు
వెనిగర్ - రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర - రెండు కప్పులు
మైదా - ఒక టీస్పూన్
మామిడి ప్యూరీ - ఒక కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
కుంకుమపువ్వు - చిటికెడు
ఐస్ ముక్కలు, పిస్తా తరుగు, మామిడి ముక్కలు, నీళ్లు - సరిపడా
తయారీ: మొదటగా పాలను మరిగించి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో వెనిగర్ వేసి నీళ్లు పోసి కలిపి ఉంచాలి. రెండు కప్పుల పాలల్లో వెనిగర్ నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. దాంతో పాలు విరిగిపోతాయి. వాటిని ఒక క్లాత్‌తో వడకట్టి నీటిని వేరుచేయాలి. వచ్చిన చెన్నా(విరిగిన పాల ముద్ద)ను ఐస్ నీటిలో ముంచి మళ్లీ నీళ్లని పిండాలి. ఆ తర్వాత చేత్తో కలుపుతూ సాఫ్ట్‌గా చేసుకోవాలి. చిన్న చిన్న బిస్కెట్స్‌లా చేయాలి. ఒక పాన్‌లో చక్కెర, నీళ్లు పోసి కరిగేవరకు వేడి చేయాలి.
►ALSO READ | నోరూరించే టేస్టీ & హై ప్రోటీన్ మీల్ మేకర్ పులావ్.. మధ్యాహ్న భోజనానికి పర్‌ఫెక్ట్.. ఇలా ఈజీగా చేసుకోండి!
మైదాలో మూడు టేబుల్ స్పూన్లు నీరు వేసి కలిపి ఈ చక్కెర నీటిలో పోయాలి. మూత పెట్టి మరిగించాలి. ఈ పాకంలో చెన్నా వేసి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత వాటిని చల్లార్చాలి. పాలను రెండు కప్పులయ్యేవరకు కాగబెట్టాలి. చల్లారాక ఆ పాలను మిక్సీజార్‌లో పోసి అందులో మామిడి ప్యూరీ, యాలకుల పొడి, ఐస్ ముక్కలు, కుంకుమ పువ్వు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆపై ఒక గిన్నెలో చెన్నా వేసి ఈ మిశ్రమాన్ని పోయాలి. గార్నిష్ కోసం పిస్తా తరుగు, మామిడి ముక్కలు వేసి సర్వ్ చేయడమే.
