
- పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం
- వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకీడుస్తానని హెచ్చరిక
- మంత్రి కోమటిరెడ్డి మాటలనే గుర్తు చేశానన్న కేటీఆర్
- ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్.. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ పదవిని రూ.50 కోట్లకు అమ్ముకున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్తెలంగాణ మాజీ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జవాబు చెప్పాలని కేటీఆర్ కు ఆయన బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో రిప్లై ఇవ్వకుంటే, కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌చేస్తున్న కేటీఆర్‌కు బహుశా తన నోటీసులకు రిప్లై ఇచ్చే టైమ్ కూడా లేకపోవచ్చునని విమర్శించారు. జనవరి 28న సిరిసిల్లలో నిర్వహించిన ఓ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్పదవిని రేవంత్‌రెడ్డికి రూ.50 కోట్లకు అమ్ముకున్నారంటూ మాణిక్కం ఠాగూర్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఠాగూర్‌కు ట్యాగ్ చేయడంతో ఆయన తన లీగల్టీమ్ద్వారా కేటీఆర్‌కు నోటీసులు పంపించారు. ‘‘ఎలాంటి ఆధారాలు లేకుండానే నేను రూ.50 కోట్లు తీసుకుని రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్పదవి ఇప్పించానని మీరు ఆరోపణలు చేశారు.
నేను మీకు వ్యక్తిగతంగా తెలియదు. ఎప్పుడు కలిసింది కూడా లేదు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారు. బహిరంగంగా ప్రజలు, మీడియా ముందు మీరు చేసిన ఈ నిరాధార ఆరోపణలు.. సోషల్‌మీడియాలో వైరల్అయ్యాయి. దేశవ్యాప్తంగా నా పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. ఎన్నో ఏండ్లుగా నిజాయతీగా రాజకీయాలు చేస్తున్న నాకు అవినీతి మరక అంటించాలని చూశారు. మీ కామెంట్లు నన్ను మానసికంగా కుంగదీశాయి. దీనిపై వారం రోజుల్లోగా మీరు సమాధానం చెప్పాలి. లేదంటే లీగల్యాక్షన్తీసుకుని కోర్టుకీడ్చాల్సి వస్తుంది’’ అని నోటీసుల్లో ఠాగూర్ హెచ్చరించారు. ఆ నోటీసులను ‘ఎక్స్’లోనూ షేర్ చేస్తూ.. లేనిపోని ఆరోపణలు, అబద్ధాలను ప్రచారం చేస్తే ఎవరినైనా వదిలిపెట్టబోనని అన్నారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎంజాయ్మెంట్లకు స్వస్తి పలకాల్సిన టైమ్వచ్చిందని పేర్కొన్నారు. కాగా, గతంలో ఇవే ఆరోపణలపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలను మధురై కోర్టుకు లాగిన ఫొటోలను ట్యాగ్‌చేశారు.
ముందు మీ మంత్రికి పంపండి: కేటీఆర్
మాణిక్కం ఠాగూర్నోటీసులపై కేటీఆర్‌స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలనే తాను గుర్తు చేశానని పేర్కొన్నారు. దమ్ముంటే ముందు కోమటిరెడ్డికి నోటీసులు పంపాలని సవాల్ చేశారు. ‘‘మీకు దమ్ముంటే.. నోటీసులను ముందు మీ సొంత పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పంపండి. లేదంటే అసలు భయమెరుగని నేతనంటూ మీరు చేస్తున్న స్టంట్లను ఆపేయండి. మీ పార్టీ లీడర్నే ప్రశ్నించలేకుంటే.. మీరు మేకవన్నె పులి లాంటి వాళ్లే. కోర్టులు కూడా అన్ని గమనిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేవంత్‌రెడ్డి మీకు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుగోలు చేశారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాలనే నేను ప్రస్తావించాను. వెంకట్‌రెడ్డి అప్పుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. మీరు పంపే పరువు నష్టం నోటీసులను నా చిరునామాకు కాకుండా.. సెక్రటేరియెట్ లోని వెంకట్ రెడ్డి ఆఫీసుకు పంపించండి’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్టు పెట్టారు.
కేటీఆర్ పోస్టుకు మాణిక్కం కౌంటర్..
కేటీఆర్ పోస్టుకు మాణిక్కం ఠాగూర్మళ్లీ కౌంటర్ ఇచ్చారు. అయిపోయిన దాన్ని బయటకు తీసి, అసలు కథను తప్పుదోవ పట్టించొద్దంటూ కేటీఆర్‌కు చురకలంటించారు. ‘‘మీరు కేవలం నాపైనే ఆరోపణలు చేశారు. వీడియోలో మీరెక్కడా ఇతరుల పేర్లను తీయలేదు. నా గురించి మాత్రమే మాట్లాడారు. కాబట్టి మధురై కోర్టు బెంచ్‌నుంచి మీరు పారిపోలేరు. మీ అహంకారంతో మీకు ఒరిగేదేమీ లేదు. మీ పెయిడ్సోషల్మీడియా టీమ్కేవలం ట్విట్టర్ లో మాత్రమే దాడిచేయగలదు. ఓ అమాయకుడిని బ్లేమ్చేసినందుకు కోర్టు కేసును ఎదుర్కోవాల్సిందే. నిజాయతీపరుల మీద మీరు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకే కేసు వేస్తున్న. మీరంటే పుట్టుకతోనే ధనవంతుల ఇంట్లో పుట్టారు. కానీ, నేను ఓ సాధారణ టీచర్ఇంట్లో పుట్టి కష్టపడి పైకొచ్చాను. నా గౌరవాన్ని కాపాడుకునేందుకు చివరిదాకా పోరాడుతూనే ఉంటాను’’ అని ఠాగూర్ పేర్కొన్నారు.