
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ 2023 జూన్ 30 శుక్రవారం రోజున రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్ అనుసూయా ఉయికేని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడంలో విఫలమైనందున బీరెన్ సింగ్ రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది.
బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని.. లేకుంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి రాష్ట్రంలో పరిస్ధితిని చక్కదిద్దుతుందని సింగ్ ఎదుట కేంద్రం రెండు ఆప్షన్లను ముందుంచిందని సమాచారం. శుక్రవారం మణిపూర్ ముఖ్యమంత్రి సచివాలయం , రాజ్ భవన్ వెలుపల మహిళలు గుమిగూడారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయవద్దని నినాదాలు చేశారు.
బిరెన్ సింగ్ మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను వివరించేందుకు ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని అమిత్ షాకు ఈ సమావేశంలో వివరించానని బిరెన్ సింగ్ తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఈ ఘర్షణల్లో వందమందికి పైగా మరణించారు. మొదట్లో మే 3వతేదీన కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించడంతో హింస చెలరేగింది.