మణిపూర్ సీఎంను బర్తరఫ్ చేయాలి .. ప్రజా సంఘాల డిమాండ్

మణిపూర్  సీఎంను బర్తరఫ్ చేయాలి ..  ప్రజా సంఘాల డిమాండ్

బషీర్ బాగ్ , వెలుగు : మణిపూర్ లో అల్లర్లకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్​ చేశాయి.  హిమాయత్​ నగర్​లో ఆదివారం గిరిజన ,మహిళా , రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి ,విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టాయి. ప్రజా సంఘాల ప్రతినిధి పశ్యపద్మ మాట్లాడుతూ..  మణిపూర్ లో తెగల మధ్య చిచ్చు పెట్టిన ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

జాతీయ మహిళా సమాఖ్య కార్యదర్శి కూనంనేని రజిని మాట్లాడుతూ కొండ ప్రాంతంలోని ఖనిజ సంపదపై కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే రెండు తెగల మధ్య గొడవలను పాలకులు సృష్టించారని ఆరోపించారు. గిరిజన సమాఖ్య నేత అంజయ్య నాయక్ , విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ , వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, శంకర్ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, శ్రీమాన్ , రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభు లింగం పాల్గొన్నారు. 

 సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలి

పద్మారావునగర్​ : మణిపూర్​లో  మహిళల ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలని ఆలిండియా షెడ్యూల్ కులాల హక్కుల ప్రొటెక్షన్​ సొసైటీ జాతీయ అధ్యక్షుడు రాగాల నాగేశ్వర రావు, రాష్ర్ట అధ్యక్షుడు డి.సుదర్శన్​ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సంఘం నేతలు జీఎస్​ వీణ, చంద్రకళా, మామిడి రేణుక, శంకర్​ తదితరులు పాల్గొన్నారు.