- మంజీరా నదిపై హైలెవల్ బ్రిడ్జి కట్టినా నిరుపయోగంగానే..
- రెండు జిల్లాలను కలిపే వంతెన కోసం తప్పని నిరీక్షణ
- నిధుల కోసం మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు, ఇపుడైనా మోక్షం కలిగేనా?
మెదక్/పాపన్నపేట, వెలుగు: కామారెడ్డి, -మెదక్ జిల్లాల మధ్య దూర భారాన్ని తగ్గించేందుకు రెండు జిల్లాల సరిహద్దులోని మంజీరా నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ఐదేండ్లుగా నిరుపయోగంగా ఉంది. బ్రిడ్జి నిర్మాణంతో పాటు కామారెడ్డి జిల్లా వైపు అప్రోచ్ రోడ్డు పూర్తి చేశారు. అయితే నిధులు అయిపోయాయనే సాకుతో మెదక్ జిల్లా వైపు అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో ఐదేండ్లుగా పనులు పెండింగ్ లో ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో అప్రోచ్ రోడ్డు కోసం పలుమార్లు ఆర్అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. తాజాగా మంజీరా బ్రిడ్జిని వినియోగంలోకి తెచ్చేందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
రూ.22 కోట్ల బ్రిడ్జి వృథా..
మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో మంజీరా నది ప్రవహిస్తోంది. నదికి ఇవతలి వైపు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, అవతలి వైపు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని గ్రామాలు అర కిలోమీటరు దూరంలోనే ఉన్నా, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వెళ్లలేని పరిస్థితి. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దర్శించుకోవాలంటే ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగి, రెండు, మూడు బస్సులు మారి రావాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయి.
ఈ క్రమంలో రెండు జిల్లాలను కలుపుతూ మంజీరా నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించి దూర భారం తగ్గించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బ్రిడ్జి నిర్మాణం జరిగితే అటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల వారికి, ఇటు మెదక్ జిల్లాలోని పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం రేగోడ్, పెద్ద శంకరంపేట మండలాల వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
2017లో మంజూరైనా..
తెలంగాణ ఏర్పాటు అనంతరం మంజీరా నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించింది. 2015లో నిజామాబాద్ జిల్లా ఆఫీసర్లు సర్వే చేశారు. 2017లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో టెండర్, అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తయ్యాక 2018లో పాపన్నపేట మండలం రాంతీర్థం. నాగిరెడ్డిపేట మండలం వెంకాయపల్లి మధ్య మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలవగా, 2022లో పూర్తయ్యాయి.
అలాగే కామారెడ్డి జిల్లా వైపు తాండూర్ మీదుగా ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులు సైతం పూర్తయ్యాయి. మెదక్ జిల్లా పరిధిలో రాంతీర్థం వద్ద బ్రిడ్జి దగ్గర నుంచి పాపన్నపేట వరకు అప్రోచ్ రోడ్డు పనులు మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు బ్రిడ్జి నిర్మాణం, కామారెడ్డి వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చయిపోయాయి.
దీంతో నిధులు లేక మెదక్ వైపు అప్రోచ్ రోడ్డు పెండింగ్ లో పడింది. దీంతో కోట్లు ఖర్చుచేసి కట్టిన బ్రిడ్జి వృథాగా మారింది. మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని భావించిన రెండు జిల్లాల ప్రజలకు నిరాశే మిగిలింది.
3 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మించాలే..
హైలెవల్ బ్రిడ్జి వినియోగంలోకి రావాలంటే రాంతీర్థం నుంచి పాపన్నపేట వరకు 3 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు నిర్మించి బ్రిడ్జిని వినియోగంలోకి తేవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతుండడంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచన మేరకు ఆర్అండ్ బీ అధికారులు రూ.25 కోట్లతో ప్రపోజల్స్ రూపొందించారు.
ఇటీవల ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి ఉపయోగంలోకి వచ్చి మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

