- ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నాపై కేసులు
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై 34 కేసులు పెట్టారు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యారు. 16 రోజులుగా కంది సెంట్రల్ జైల్లో ఉన్న క్రిశాంక్ విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే తనపై కేసులు నమోదు చేయించారన్నారు.
తనకు నేర చరిత్ర ఉందని దుష్ప్రచారం చేయడంతోపాటు తన ఈమెయిల్, వైఫై పాస్‌వర్డ్, ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని పోలీసులు అడిగారన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక విజన్ అంటూ ఏమీ లేదన్నారు. తాను కేసీఆర్ శిష్యుడినని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడినని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని క్రిశాంక్ తెలిపారు.
