ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో ఎన్నో అనుమానాలు

ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో ఎన్నో అనుమానాలు

కరీంనగర్ లో సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్ధిని ముత్తా రాధిక కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అనుమానితులు అదుపులోకి తీసుకున్నామని, రెండు మూడు కోణాల్లో హత్య కేసు ఇన్విస్టిగేట్ చేస్తున్నామని సీపీ సత్యనారాయణ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు.

మీడియాతో మాట్లాడుతూ…  ఓ యువకుడు లవ్ ప్రపోజ్ చేస్తే రాధిక రిజక్ట్ చేసిందని, అనుమానం వచ్చి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు సీపీ. ఒకవేళ బలత్కారం చేస్తే రక్షించుకునే ప్రయత్నంలో కూడా హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలున్నాయని ఆయన అన్నారు.

యువతి తండ్రి  హత్య జరిగిన ఇంట్లో దొంగతనం కూడా జరిగిందని ఫిర్యాదు చేశాడన్నారు . అతడు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడని తెలియడంతో ఎవరైనా చోరీ కోసం వచ్చిన వాళ్లు  ఈ దారుణం చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు.  సెల్ లొకేషన్, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, మ్యాగ్జిమమ్ 48 గంటల్లోనే హంతకులను పట్టుకుంటామని చెప్పారు.

సమత, హాజీపూర్ కోర్టు లాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఈ కేసు అప్పగించి నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని సత్యనారాయణ అన్నారు. కుటుంబ సభ్యులపై వస్తున్న అనుమానాలపై కూడా దర్యాప్తు జరుగుతోందని, మొత్తం 8 టీములతో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.

“గొంతు కోస్తే రక్తం ఫౌంటెన్ లాగా చిమ్ముతుంది, కానీ అలాంటి ఆనవాళ్లు లేకపోవడం కేసులో కీలక ఆధారం కానుంది. ముందే హత్య చేసి ఆ తర్వాత గొంతు కోసి ఉండొచ్చు. ఆల్ మోస్ట్ కేసు కొలిక్కి వచ్చినట్లేనని,  త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు” సీపీ సత్యనారాయణ.