ఎందరో ట్రేడర్లు కొందరికే లాభాలు

ఎందరో ట్రేడర్లు కొందరికే లాభాలు

కిందటేడాది నిఫ్టీ  23 శాతం పెరిగింది. ఏడాది చివరిలో కొంత నష్టపోయినప్పటికీ, మంచి లాభాలనే ఇచ్చింది. దీన్ని బట్టి మార్కెట్‌‌ ఇంకా అప్‌‌సైడ్‌‌ ట్రెండ్‌‌లో ఉందని అంచనావేయొచ్చు.ఈజీగా లాభాలొస్తుండడంతో ఈఏడాది కూడామార్కెట్లలో డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకడుగేయకపోవచ్చు. జెరోధా ఫౌండర్ నితిన్ కామత్‌‌ మార్కెట్‌‌లో ఎంటర్‌‌‌‌ అయ్యే వారికి కొన్ని సలహాలిచ్చారు. దేశంలో సుమారు 50 లక్షల మంది యూజర్లు జెరోధా సొంతం. నితిన్‌‌కు 25ఏళ్ల ట్రేడింగ్ ఎక్స్‌‌పీరియెన్స్ ఉంది. తన అనుభవంతో నేర్చుకున్న పాఠాలను ఇన్వెస్టర్లతో పంచుకున్నారాయన. ఈజీగా డబ్బులు సంపాదించే ప్లేస్‌‌లలో  స్టాక్‌‌ మార్కెట్లే అత్యంత కష్టమైనవని  చెప్పారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: నా మార్కెట్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో చాలా విషయాలు మారడం చూశా. ఒక్క దురాశ తప్ప. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చనే ఆలోచనతో చాలా మంది ట్రేడర్లు మార్కెట్‌‌‌‌ వైపు చూస్తున్నారు. సోషల్‌‌‌‌మీడియా ఇలాంటి వారిని మార్కెట్‌‌‌‌ వైపు తీసుకొస్తోంది.  వాస్తవంగా చూస్తే గత మూడేళ్లలో  యాక్టివ్ ట్రేడర్లలో కేవలం 1 శాతం  మంది మాత్రమే ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్ల కంటే ఎక్కువ సంపాదించారు. సుమారు 25 ఏళ్లు ట్రేడర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగా. నా అదృష్టం కొద్దీ వేల మంది ట్రేడర్లను కలిసే అవకాశం వచ్చింది. ఈ ట్రేడర్ల నుంచి, నా సక్సెస్ , ఫెయిల్యూర్స్‌‌‌‌ నుంచి  ఈ కింది విషయాలను తెలుసుకున్నా. 

‘స్టాప్‌‌‌‌’ ముఖ్యం..
తెలివైనవాళ్లందరిలో ఒకటి కామన్. వీరందరికి ఎప్పుడు బయటపడాలో తెలుసు. ఎంత  నష్టాన్ని అఫోర్డ్​ చేయగలం, ట్రేడ్ లాభాల్లోకి మారడానికి ఎంత టైమ్ వెయిట్ చేయగలమనే విషయాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. స్టాప్‌‌‌‌ లాస్‌‌‌‌కు కట్టుబడి ఉండాలి.  ముఖ్యంగా ఇప్పుడిప్పుడే మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యేవారు స్టాప్‌‌‌‌ లాస్‌‌‌‌ను మరిచిపోకూడదు. ఓ సారి జాక్‌‌‌‌ స్క్వాగర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఒక  పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌ను రికార్డ్ చేసే అదృష్టం దక్కింది. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ‘ఏ ట్రేడ్‌‌‌‌లోనైనా ట్రేడింగ్ క్యాపిటల్‌‌‌‌లో1 శాతం కంటే ఎక్కువ నష్టపోకూడదు’.  నష్టాలు పెరిగేకొద్దీ ట్రేడ్‌‌‌‌పై  హేతుబద్దంగా ఆలోచించే అవకాశం తగ్గిపోతుంది. ఆప్షన్స్‌‌‌‌ ట్రేడర్లు తమ క్యాపిటల్‌లోని 2 లేదా 3 శాతం అమౌంట్‌తో  కొనడం లేదా అమ్మడం చేస్తేనే,  1 శాతం స్టాప్‌‌‌‌లాస్‌‌‌‌ను పెట్టుకోవాలి. 

ట్రెండ్‌‌‌‌తోనే కొనసాగాలి..
షేరును 52 వారాల కనిష్టం దగ్గర కొనడం కొత్త ట్రేడర్లు కామన్‌‌‌‌గా ఫాలో అయ్యే స్ట్రాటజీ.  షేరు ఇంతకంటే ఇంక తగ్గదని వారు భావిస్తారు. వాస్తవంగా చూస్తే, షేర్లు  ట్రెండ్‌‌‌‌ను ఫాలో అవుతాయి. అంటే లాంగ్‌‌‌‌ టైమ్‌‌‌‌ వరకు పెరగడమో లేదా తగ్గడమో చేస్తాయి. షేర్లను ట్రేడ్‌‌‌‌ చేయడానికి బెస్ట్ స్ట్రాటజీ  ఏంటంటే, అప్‌‌‌‌ ట్రెండ్‌‌‌‌లో కొనడం, డౌన్‌‌‌‌ ట్రెండ్‌‌‌‌లో అమ్మేయడం. 

పడుతున్న షేర్లను యావరేజ్‌‌‌‌ చేయొద్దు..
సాధారణంగా పెరుగుతున్న షేర్లను అమ్మేయడం, పడుతున్న షేర్లను కొనడం లేదా హోల్డ్ చేస్తుంటారు కొత్త ఇన్వెస్టర్లు. కానీ, దీనికి వ్యతిరేకంగా చేయాలి. నష్టాలిచ్చే షేర్లను వదిలించుకోవాలి. లాభాలిచ్చే వాటిని హోల్డ్‌‌‌‌ చేయాలి. పెరుగుతుందని ఆశ పెట్టుకోవడం అసలు ట్రేడింగ్ స్ట్రాటజీనే కాదు. రేట్లు పడుతున్నప్పుడు మరిన్ని షేర్లను కొనడం ఒకట్రెండు సార్లు పనిచేస్తుంది. కానీ, ఇదొక లాసింగ్‌‌‌‌ స్ట్రాటజీ. రేట్లు పడుతున్నప్పుడు మరిన్ని షేర్లను కొనడమంటే చేసిన తప్పును సరిచేసుకోకుండా కవర్ చేసుకోవడమని అర్థం. స్టాప్‌‌‌‌లాస్ ఉంటే దీని నుంచి తప్పించుకోవచ్చు. 

లెవరేజ్‌‌‌‌తో ఎప్పటికైనా నష్టం..
లెవరేజ్‌‌‌‌ (బ్రోకర్ ఇచ్చే అప్పు) తీసుకొని భారీగా లాభాలు పొందడానికి అందరూ ఇష్టపడతారు. కానీ, ఒక్క బ్యాడ్ ట్రేడ్‌‌‌‌తోనే అకౌంట్‌‌‌‌లోని మొత్తం అమౌంట్ పోవచ్చు. చాలా మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ఆపేయడానికి ఇదొక కారణం. ట్రేడ్‌‌‌‌ కలిసొస్తుందని నమ్మకం ఉంటేనే లెవరేజ్‌‌‌‌ను పొదుపుగా వాడాలి. అప్పుడు కూడా స్టాప్‌‌‌‌లాస్‌‌‌‌ను ఉపయోగించాలి. 

స్టాక్ టిప్‌‌‌‌లిచ్చి మిమ్మల్ని ధనవంతులు చేస్తామని చెప్పేవారికి కొదవలేదు. కానీ, ఈ టిప్‌‌‌‌లు చాలా అరుదుగా పనిచేస్తాయి.  ప్రజలు సరిగ్గా సలహాలను ఫాలో కాలేరు. అందుకే వారొక మంచి అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ను గుర్తించినా, సలహాలు సరిగ్గా పాటించక డబ్బులు సంపాదించలేరు.  అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటంటే, సోషల్‌‌‌‌ మీడియా, ఇతర గ్రూప్‌‌‌‌లలోని స్టాక్ టిప్‌‌‌‌లను ఫాలో కావడమే. వీటిలో మెజార్టీ టిప్‌‌‌‌లు పంప్ అండ్  డంప్ స్కామ్సే (కావాలని పెంచి పడేసే షేర్లే) !