గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా...

గంగాదేవి.. నది రూపంలో భూమికి  ఎందుకు  వచ్చిందో తెలుసా...

గంగానది పుట్టుక వెనుకనున్న పురాణకథను ఈ వాక్యాల్లో ప్రస్తావించారు. శ్రీ మహావిష్ణువు పాదాల్లోంచి పుట్టిన గంగ పరవళ్ళు తొక్కుతూ భువికి దూకిన గంగమ్మను..శివుడు తన జటాజూటంలో బంధించి, భూమి తట్టుకునేంత ప్రవాహాన్ని మాత్రమే వదిలాడన్నది పురాణ కథనం. సురగంగ అంటే దేవలోకానికి చెందినది అని అర్థం.  అసలు గంగానది దివి నుంచి భువికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే పురాణాల్లో ప్రస్తావించిన సగరుడి వంశం గురించి తెలుసుకోవాలి. 

గంగావతరణం వెనుకున్న కథనం

ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు... కేశిని, సుమతి. భృగుమహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవై వేల మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేథ యోగం సంకల్పిస్తాడు. అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడి భయం. చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి, కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. క్రతువు ఆగిపోతుంది అని సగరుడు కుమిలిపోతాడు. అరవై వేల మంది తనయులూ  యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. అయితే  ఆ యాగాశ్వాన్ని కపిల మహర్షి తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడనుకుని..మహర్షి మీద అభాండాలు వేస్తారు. ఆగ్రహించిన కపిల మహర్షి అరవైవేల మందినీ కంటిచూపుతో కాల్చేస్తాడు. అసమంజుడు తన సోదరులను వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. గంగాదేవిని తీసుకొచ్చి ప్రవహింపజేస్తే సోదరులుబతుకుతారని భావించి తపస్సు మొదలుపెడతాడు. తపస్సు ఫలించదు. ఆ తర్వాత పినతండ్రుల జాడ వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు  అసమంజుడి తనయుడు... తన తపస్సు కూడా ఫలించదు. 

ఫలించిన భగీరథుడి తపస్సు

సగరుడి కొడుకైన అసమంజుడి మనవడు భగీరథుడు..గంగను భూమిపైకి తీసుకొచ్చేందుకు తన ముందు తరాలు చేసిన ప్రయత్నాన్ని మరింత కఠినంగా ప్రారంభించాడు భగీరథుడు.భరీరథుడి కఠోర తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు..కానీ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమాతకు లేదని చెబుతాడు.అప్పుడు పరమేశ్వరుడిని ప్రశన్నం చేసుకుంటాడు భగీథుడు.  తన తలపై గంగ ప్రవాహాన్ని ధరించడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు..అలా దివి నుంచి శివుడి జటాఝూటంలోకి దూకిన గంగమ్మ అక్కడి నుంచి పాయలుగా మారి హిమాద్రిపై అడుగుపెట్టింది. ఆ రోజే వైశాఖ శుద్ధ సప్తమి...అందుకే ఈ రోజుని గంగా సప్తమి అంటారు. 

వైశాఖ శుద్ధ సప్తమి (మే 14)ని గంగా సప్తమి అంటారు. గంగాదేవి దివి నుంచి భువిపైకి అడుగుపెట్టిన రోజు. అంటే గంగానది పుట్టిన రోజు. కొందరు గంగాజయంతి అని కూడా అంటారు.. గంగావతరణం గురించి కవులు  ఈ పాటల్లో అత్యద్భుతంగా చెప్పారు శ్రీ మహావిష్ణువు పాదం నుంచి ఉద్భవించిన గంగమ్మ..భగరీథుడి తపస్సుకి మెచ్చి శివుడి జటాఝూటాన్ని మజిలీగా చేసుకుని అక్కడి నుంచి హిమగిరిపై అడుగుపెట్టి..సగరుడి వంశాన్ని పావనం చేసి..మానవాళికి జీవనవాహినిగా నిలిచింది. ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా వర్ణించారు కవులు... 

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె..
 

అంటూ దివి నుంచి గంగానది పయనాన్ని అత్యద్బుతంగా వర్ణించారు కవులు... ఆకాశం నుంచి శివుడి శిరస్సు..అక్కడి నుంచి శీతాద్రి( హిమగిరి) అక్కడి నుంచి భువి..మైదాన ప్రాంతంలోకి..అక్కడి నుంచి పాతాళానికి..ఇలా మూడు లోకాలను పావనం చేసిన గంగానది...

హరి పాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా

శ్రీమన్నారాయణుడి పాదాల వద్ద జన్మించిన గంగమ్మ..భగీరథుని తపస్సుకి మెచ్చి భువినుంచి దివికి దిగి హిమగిరిపై అడుగుపెట్టిందని వర్ణించారు సినీ కవులు

జీవన వాహిని....పావని....
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి

భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతి ముఖ్యమైనది గంగ. పశ్చిమ హిమాలయ పర్వతాల్లో పుట్టి భారతదేశం మీదుగా బంగ్లాదేశ్ లోకి కూడా ప్రవేశించి దాదాపు 2,525 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇది జీవనది. అది ప్రవహించే దారంతా వేల ఎకరాల పంటభూములను తడుపుతూ, ఎన్నో జీవరాశులకు ఆశ్రయమిస్తూ, మానవ అవసరాలను తీరుస్తూ వెళ్తుంది. అందుకే, జీవన వాహిని... పావని.... అని పాటను భౌగోళిక అంశంతోనే ప్రారంభించాడు సినీ కవి వేటూరి..

విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని