
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. విమానంలోని ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్ల్లో అనూహ్య మార్పుల వల్లే ప్లయిట్ క్రాష్ అయ్యిందని ఏఏఐబీ తేల్చింది. ఈ క్రమంలో ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. శనివారం (జూలై 12) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఏఐబీది ప్రైమరీ రిపోర్ట్ మాత్రమేనని తెలిపారు.
పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని.. తుది నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఏఏఐబీ ప్రైమరీ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని.. తుది విచారణ పూర్తి అయ్యే వరకు మీడియా, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. పైలట్ల సంభాషణ ఆధారంగా తుది నిర్ణయాని రావొద్దని.. మనకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పైలట్లు, సిబ్బంది ఉన్నారన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తులో ఏఏఐబీ ఇన్విస్టిగేషన్ టీమ్ బాగా పని చేసిందని కొనియాడారు. విచారణలో ఎయిర్ ఇండియా అన్ని విధాలుగా సహకరిస్తోందని చెప్పారు రామ్మోహన్ నాయుడు. తుది నివేదిక త్వరలో వస్తుందని, ఆ తర్వాత మేం ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.
కాగా, 2025, జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనవాసాల మధ్య కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందగా.. మెడికల్ కాలేజీ భవనంపై ఫ్లైట్ కుప్పకూలడంతో అందులోని కొందరు మరణించారు. ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది మృతి చెందారు.