
బెంగుళూరు: 2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నాటక ప్రభుత్వం.. తొక్కిసలాటపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏర్పాటైన ఈ వన్ మ్యాన్ కమిషన్ను నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విచారణ జరిపిన ఏక సభ్య కమిషన్.. నెల రోజుల పాటు అనేకమంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించడంతో పాటు ఘటన స్థలాన్ని పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్టులో జ్యూడిషియల్ కమిషన్ కీలక విషయాలు ప్రస్తావించింది. తొక్కిసలాటకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని.. ఈ ఘటనకు వాళ్లే బాధ్యత వహించాలని పేర్కొంది.
►ALSO READ | ఎడమ వైపు ఎక్కువగా వాలిపోతున్నా.. ఆటలో లోపాలను ఒప్పుకున్న గోల్డెన్ బాయ్ నీరజ్
విక్టరీ పరేడ్, సన్మాన కార్యక్రమం నిర్వహించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ అలాగే కొనసాగించారని రిపోర్టులో రాసుకొచ్చింది కమిషన్. 30 వేల మంది కెపాసిటీ గల స్టేడియం లోపల కేవల 79 మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని, బయట ఎటువంటి మోహరింపు లేదని.. అధికారులు సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారని రిపోర్టులో పేర్కొంది కమిషన్.
తొక్కిసలాట జరిగిన రోజు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయంత్రం 4 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ సీపీకి సాయంత్రం 5 గంటల వరకు అంటే సంఘటన జరిగిన గంట వరకు కూడా దీని గురించి తెలియదని కమిషన్ పేర్కొంది. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు అందింది కానీ ఇంకా చూడలేదని తెలిపారు. 2025, జూలై 17న జరగనున్న కేబినెట్ భేటీలో కమిషన్ నివేదికపై చర్చిస్తామని పేర్కొన్నారు.