
గురుగ్రామ్: తన ఆటకు ఇబ్బందిగా మారుతున్న ఓ సమస్యను గుర్తించానని ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వెల్లడించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి గోల్డ్ మెడల్ గెలవాలని కోరుకుంటున్న తాను వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టానని చెప్పాడు. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇందుకోసం చోప్రా చెక్‌లోని ప్రేగ్, నింబర్క్‌లో 57 రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నాడు. ఇందుకోసం శుక్రవారం రాత్రి తన ఫిజియో ఇషాన్ మార్వాతో కలిసి యూరోప్ వెళ్లాడు.
సెప్టెంబర్ 5 వరకు అక్కడే ఉండనున్న చోప్రా ఇందుకోసం రూ.19 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ‘నా ఆటలో ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించా. ఈటెను విసిరేటప్పుడు ఎక్కువగా ఎడమ వైపు వాలిపోతున్నా. దీనిపై పని చేయాల్సి ఉంది. ట్రెయినింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. కానీ పోటీల్లో నేను చేసే అదనపు ప్రయత్నం వల్ల దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది’ అని చోప్రా పేర్కొన్నాడు. తరచుగా 90 మీటర్ల మార్క్‌ను అందుకోవడంపై కూడా దృష్టి పెట్టాలన్నాడు.
‘నేను ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ సాధించా. కానీ దాన్ని మరింత తరచుగా సాధించాలి. ఇందుకోసం చాలా స్థిరంగా రాణించాలి. ప్రస్తుతం 88, 89 మీటర్ల వద్దే ఆగిపోతున్నా. ఈ పెర్ఫామెన్స్‌కు నా కోచ్ సంతోషంగా ఉన్నా, నేను మరింత స్థిరత్వం సాధించాలి. నా తర్వాతి లక్ష్యం వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం. దాన్ని కచ్చితంగా సాధించి తీరాల్సిందే. ఈ టోర్నీకి ప్రిపేర్ అయ్యేందుకు ఏఏ ఈవెంట్లలో పోటీపడాలో నా కోచ్‌తో కలిసి ప్లాన్ చేసుకుంటా’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.