వీధి కుక్కలకు చికెన్ రైస్ స్కీం.. కోట్లు ఖర్చు చేస్తున్న గొప్ప కార్పొరేషన్

వీధి కుక్కలకు చికెన్ రైస్ స్కీం.. కోట్లు ఖర్చు చేస్తున్న గొప్ప కార్పొరేషన్

వీధికుక్కలకోసం చికెన్ రైస్ స్కీం..కోట్లు ఖర్చు చేసి మరీ వీధి కుక్కలకు చికెన్ పెడుతున్నారు. మనుషుల రక్షణ, కుక్కల సంక్షేమం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తారట. ఇటీవల కాలంలో నగరాల్లో వీధి కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం, ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్కల దాడులకు చెక్ పెట్టేందుకు నగర కార్పొరేషన్లు ఈ పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా బెంగళూరు కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బెంగళూరు నగరంలోని వీధి కుక్కల కోసం చికెన్ రైస్ స్కీం ను ప్రవేశ పెడుతోంది బృహత్ బెంగళూరు గ్రేటర్ కార్పొరేషన్.  వీధికుక్కల దూకుడు స్వభావం తగ్గించేందుకు, కుక్క కాటు కేసులను నియంత్రించేందుకు, కుక్కల ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు, వాటికి సరిపడా ఆహారం అందించేందుకు BBMP ఏటా రూ. 2.88 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. 

ఈ పథకం కింద బెంగళూరులోని మొత్తం 2.8 లక్షల వీధి కుక్కలలో మొదటి విడతగా 5,000 వీధి కుక్కలకు రోజువారీ ఆహారం అందించనున్నారు. ఈ పథకం కోసం BBMP ఏటా రూ. 2.88 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుక్కకు రోజుకు సుమారు రూ.22.42 ఖర్చవుతుందని అంచనా.

ఈ పథకంలో భాగంగా ప్రతి కుక్కకు రోజుకు 367 గ్రాముల వండిన చికెన్ రైస్ అందించనున్నారు. ఇందులో 150 గ్రాముల చికెన్ (ప్రోటీన్), 100 గ్రాముల బియ్యం (కార్బోహైడ్రేట్లు), 100 గ్రాముల కూరగాయలు (ఖనిజాలు), 10 గ్రాముల తినదగిన నూనె ఉంటాయి. ఇది 465-నుంచి 750 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది.

Also Read :  కదిలే ట్రైన్ లో రీల్స్ చేసింది.. తన్నులు తిన్నది

నగరంలోని ఎనిమిది జోన్లలో ఈ ఆహార పంపిణీ సేవలు అందించనున్నారు. ప్రతి జోన్‌కు ఏటా రూ. 36 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. ప్రతి జోన్‌లో 100 నుంచి 125 ఫీడింగ్ పాయింట్లలో ఈ ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. 

ఈ పథకంలో ఎంపిక చేయబడిన కాంట్రాక్టర్లు ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్, నీరు వంటి సదుపాయాలను వారే సమకూర్చుకోవాలి. అందించే ఆహారం పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రమాణాలను పాటించాలి. 

ఆహారాన్ని ఆఫ్-సైట్‌లో వండి నియమించబడిన పాయింట్ల వద్ద పంపిణీ చేయాలి. కుక్కలకు మళ్ళీ ఉపయోగించగల పాత్రల్లో ఆహారం పెట్టి, ప్రతి రోజు వాటిని శుభ్రం చేయాలి.కాంట్రాక్టర్లు ప్రతిరోజూ జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలను అందించాలి.

వివాదం,విమర్శలు:

ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.జంతు సంక్షేమ కార్యకర్తలు ,జంతు ప్రేమికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆకలితో ఉన్న కుక్కలకు ఆహారం అందిస్తే అవి మరింత ప్రశాంతంగా ఉంటాయని వాటి ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా కుక్క కాటు కేసులు తగ్గుతాయని వారు అంటున్నారు.

కొంతమంది ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు (sterilization) టీకాలపై దృష్టి పెట్టడం అవసరం, వాటికి ఆహారం పెట్టడం ద్వారా వీధుల్లో వాటి జనాభా మరింత పెరుగుతుందని అంటున్నారు. 

ప్రజలకు కనీస ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో కుక్కలకు బిర్యానీ పెట్టడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సరైంది కాదని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా దీనిని పెద్ద ఆరోగ్య, భద్రతా ప్రమాదం అని అంటున్నారు. కుక్కకాటు నివారణకు శాస్త్రీయ పరిష్కారాలను డిమాండ్ చేస్తున్నారు. 

BBMP అధికారులు మాత్రం ఇది కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజల భద్రతకు సంబంధించిన చర్య అని వాదిస్తున్నారు. ఆహారం లేకపోవడం వల్ల కుక్కలు దూకుడుగా మారతాయని, ఈ పథకం వల్ల వాటి దూకుడు తగ్గి కుక్క కాటు కేసులు తగ్గుతాయని వారు నమ్ముతున్నారు. BBMP ఇప్పటికే కుక్కల సంతాన నిరోధక కార్యక్రమాలు (ABC), యాంటీ-రేబిస్ టీకాల (ARV) కోసం రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.