ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపించిన అల్లుడు.. దృశ్యం 2 సినిమా చూసి స్కెచ్..

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపించిన అల్లుడు.. దృశ్యం 2 సినిమా చూసి స్కెచ్..

డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని అనడానికి చాలా సంఘటనలు ఉదాహరణగా చెప్పచ్చు. డబ్బు కోసం సొంత మనుషులను సైతం హతమార్చిన ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం.. సిద్దిపేటలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది.. ఇన్సూరెన్సు డబ్బుల కోసం అత్తను చంపించాడు ఓ అల్లుడు. జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కపూర్ దర్గా దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఇన్సూరెన్సు డబ్బుల కోసం రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను చంపించాడు అల్లుడు వెంకటేష్.  పక్కా ప్లాన్ ప్రకారం అత్తను చంపిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటు ప్రచారం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసు విచారణలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు పోలీసులు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్సు, ఎస్బీఐ ఇన్సూరెన్సు, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని తెలిపారు.మహీంద్రా థార్ కార్ ను అద్దెకు తీసుకొని హత్యకు ప్లాన్ చేశామని... దృశ్యం 2 సినిమా చూసి మర్డర్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు పోలీసులు. నిందితులు పొలం పని ఉందని చెప్పి తీసుకెళ్లి.. అల్లుడు తమ్ముడి వాహనంతో ఢీకొట్టి చంపినట్లు తెలిపారు పోలీసులు.