అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మోసాలిలా.. సైబర్ మోసాలను తప్పించుకునే టిప్స్ మీకోసం..

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మోసాలిలా.. సైబర్ మోసాలను తప్పించుకునే టిప్స్ మీకోసం..

ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇప్పుడు చాలా మందికి అమెజాన్ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ప్రైమ్ డే సేల్స్ వంటి ఆఫర్ల సమయంలో కొనుగోలుదారులు తమకు ఇష్టమైన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకోవాలని ఆశపడతారు. కానీ ఈ సందడిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. షాపర్లను మోసం చేయడానికి నకిలీ వెబ్‌సైట్‌లు, మోసపూరిత లింక్‌లను సృష్టిస్తుంటారు. ఈ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

మోసగాళ్లు ఎలా వల వేస్తారు?
ప్రైమ్ డే సేల్ సమయంలో మీకు అమెజాన్ నుంచి వచ్చినట్లుగా కనిపించే నకిలీ ఈ-మెయిల్‌లు లేదా SMSలు పంపిస్తుంటారు సైబర్ మోసగాళ్లు. ఈ మెసేజ్‌లలో "మీ ఆర్డర్‌లో సమస్య వచ్చింది," "మీ ఖాతా బ్లాక్ అయ్యింది," "భారీ తగ్గింపుతో మీకోసం ప్రత్యేక ఆఫర్," లేదా "గిఫ్ట్ కార్డ్ గెలుచుకున్నారు" అంటూ తప్పుడు సందేశాలు పంపిస్తుంటారు. ఇవి చూడగానే నిజమనుకుని లింక్‌ను క్లిక్ చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీరు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే.. అచ్చం అమెజాన్ అధికారిక వెబ్‌సైట్ లాగే కనిపించే ఒక నకిలీ పేజీకి యూజర్లను తీసుకెళతారు. అక్కడ  లాగిన్ వివరాలు, బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయగానే, ఆ సమాచారం నేరుగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీంతో నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతాలతో పాటు క్రెడిట్ కార్డులను ఖాళీ చేసేస్తారు సైబర్ కేటుగాళ్లు. దానిని గమనించి మేల్కొనే లోపో నష్టం జరిగిపోతుందని గుర్తుంచుకోండి.

నకిలీ లింక్‌లు, వెబ్‌సైట్‌లను గుర్తించడం ఎలా?

ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరి.

 * URL (వెబ్‌సైట్ చిరునామా)ని తనిఖీ చేయండి: ఇది చాలా ముఖ్యం. అమెజాన్ అధికారిక వెబ్‌సైట్ ఎల్లప్పుడూ https://www.amazon.in (లేదా మీ ప్రాంతాన్ని బట్టి amazon.com, amazon.co.uk) తో మాత్రమే ప్రారంభమవుతుంది. https:// అంటే ఆ వెబ్‌సైట్ సురక్షితమని, దాని పక్కన చిన్న ప్యాడ్‌లాక్ చిహ్నం కూడా ఉంటుంది. మోసపూరిత వెబ్‌సైట్‌ల URL లు amaz0n.com, amazon-deals.info, amazon.co.in.xyz.top వంటి చిన్న మార్పులతో కొన్ని అక్షరాలు లేదా అనుమానాస్పద డొమైన్ ఎండింగ్‌లతో ఉంటాయి. లింక్‌ను క్లిక్ చేయకుండా దానిపై మౌస్ పాయింటర్‌ను ఉంచితే .. అది మిమ్మల్ని తీసుకు వెళ్లే అసలు చిరునామా కనిపిస్తుంది. దానిని జాగ్రత్తగా గమనించండి.

ALSO READ : amazon Prime Day sale: ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయో ఫుల్ లిస్ట్ ఇదే..

 * ఈ-మెయిల్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి: అమెజాన్ మీకు పంపే ఏ ఈమెయిల్ లేదా మెసేజ్‌లోని లింక్‌ను నేరుగా క్లిక్ చేయవద్దు. ఒకవేళ మీకు ఏదైనా ఆఫర్ లేదా సమస్య గురించి సందేశం వస్తే, మీ బ్రౌజర్‌లో నేరుగా amazon.in అని టైప్ చేసి, అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడే మీ ఆర్డర్లు, నోటిఫికేషన్‌లు తనిఖీ చేసుకోండి.

 * అవాస్తవ ధరలు, ఆఫర్లపై నిఘా: "90% తగ్గింపుతో సరికొత్త ఐఫోన్!" లేదా "₹10,000 విలువైన కూపన్ గెలుచుకున్నారు!" వంటి నమ్మశక్యం కాని ఆఫర్లు సాధారణంగా మోసపూరితమైనవి. ఏదైనా ఆఫర్ చాలా బాగుంది అనిపిస్తే, అది నిజం కాకపోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

 * స్పెల్లింగ్ తప్పులు: నకిలీ మెసేజ్‌లు లేదా వెబ్‌సైట్‌లలో తరచుగా వ్యాకరణ లోపాలు, స్పెల్లింగ్ తప్పులు కనిపిస్తాయి. ఇవి మోసపూరితమైనవని గుర్తించడానికి ఒక సూచన.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
ఈ మోసాలను నివారించడానికి మీరు తీసుకోగల కొన్ని కీలక టిప్స్:
 * అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌ను మాత్రమే వాడండి: అమెజాన్ ప్రైమ్ సేల్స్ సమయంలో షాపింగ్ చేయడానికి ఎల్లప్పుడూ అమెజాన్ అధికారిక మొబైల్ యాప్‌ను లేదా మీ బ్రౌజర్‌లో నేరుగా amazon.in అని టైప్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించండి.

 * టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయండి: మీ అమెజాన్ ఖాతాకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను సెటప్ చేయండి. ఇది మీ పాస్‌వర్డ్ దొంగిలించబడినా కూడా అదనపు భద్రతను అందిస్తుంది. లాగిన్ అవ్వడానికి పాస్‌వర్డ్‌తో పాటు మీ ఫోన్‌కు వచ్చే OTP కూడా అవసరమవుతుంది.

 * బలమైన పాస్‌వర్డ్‌లు వాడండి: మీ అమెజాన్ ఖాతాకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. ఇతర వెబ్‌సైట్‌లకు వాడే పాస్‌వర్డ్‌లను అమెజాన్‌కు వాడకండి.

 * చెల్లింపు పద్ధతులు: అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయండి. బయట వ్యక్తులకు, ఇతర యాప్‌ల ద్వారా లేదా గిఫ్ట్ కార్డ్‌లతో చెల్లించమని అడిగితే అది మోసమే అని గుర్తుంచుకోండి.

 * సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు: మీ కంప్యూటర్, ఫోన్, బ్రౌజర్‌లను ఎల్లప్పుడూ తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో అప్‌డేట్ చేయండి. ఇది భద్రతా లోపాలను సరిచేస్తుంది. మీకు ఏదైనా అనుమానం వస్తే, నేరుగా అమెజాన్ అధికారిక కస్టమర్ సేవను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండటం ద్వారా మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మీ డబ్బును, మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.