ముంబైలో రైలు ప్రమాదం.. లోకల్ ట్రైన్ ఢీకొని ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

ముంబైలో రైలు ప్రమాదం.. లోకల్ ట్రైన్ ఢీకొని ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. సబర్బన్ రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం (నవంబర్ 6) రాత్రి 7 గంటల ప్రాంతంలో ముంబైలోని శాండ్‌హర్స్ట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST) రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, 2025, జూన్ 9న ముంబ్రా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు రైల్వే అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

►ALSO READ | నకిలీ గుర్తింపులు, మృతుల పేర్లు, డేటా లోపాలు..బ్రెజిలియన్ ముఖం హర్యానాలో ఓటర్‌గా ఎలా మారింది?

ఈ కేసును వ్యతిరేకిస్తూ సెంట్రల్ రైల్వే ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్లు గురువారం (నవంబర్ 6) సాయంత్రం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఆందోళన చేపట్టి దాదాపు గంటసేపు సబర్బన్ లోకల్ రైలు కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ నిరసన కారణంగా రైళ్లలో రద్దీ పెరిగి శాండ్‌హర్స్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవలే ఛత్తీస్ గఢ్‎లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్ రైలు ఢీకొని 11 మంది చనిపోయారు.