ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించారు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు...వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డేటా ఆధారిత పాలనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలన్నారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకుని సమర్థవంతంగా వినియోగించుకుందామని సూచించారు చంద్రబాబు.
‘అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం.రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం.. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. .క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నాం.సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నాం. గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను.నెలలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచిస్తున్నాను.నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది.ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం..ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం.దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది’ అని చంద్రబాబు తెలిపారు.
