టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రేమాయణం నిత్యం హాట్ టాపిక్ గా మారింది. వారి గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. ఇట్టే వైరల్ అవుతోంది. వారిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారని వస్తున్న కథనాలు వస్తున్నాయి. అయితే వారి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేసుకోసుకోబోతున్నారన్న దానిపై అభిమానుల్లో , సినీ వర్గాల్లో ఉత్కంతను పెంచుతున్నాయి .
నిశ్చితార్థం ఖాయం!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నల నిశ్చితార్థ వేడుక ఇప్పటికే నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. అక్టోబర్ 3, శుక్రవారం నాడు ఈ జంట ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ వార్తను ధృవీకరించడానికి కానీ, ఖండించడానికి కానీ ఇద్దరు నటులు ఇంకా ముందుకు రాలేదు.
రష్మిక -విజయ్ పెళ్లి ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రష్మిక -విజయ్ దేవరకొండలు 2026, ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. . అయితే, ఈ వార్తలపై అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, నిరాకరించనూ లేదు. కానీ, అభిమానులు మాత్రం ఈ వార్తలను నిజమని నమ్మి, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జగపతిబాబు షోలో గుట్టురట్టు!
రష్మికా మందన్న ఇటీవల జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో పాల్గొని, అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ షోలో జగపతి బాబు సరదాగా "విజయ్ దేవరకొండ ఫ్రెండ్‌షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్ ఆల్ టైమ్ ఫ్యాన్... అంటే నువ్వు విజయాన్ని, విజయ్ పేరును పూర్తిగా సొంతం చేసుకున్నావా?" అంటూ రష్మికను ఆటపట్టించారు. దీనికి రష్మిక సిగ్గుతో కూడిన నవ్వుతో స్పందించింది.
అంతేకాకుండా, రష్మిక చేతి వేలికి ఉన్న ముఖ్యమైన ఉంగరాల గురించి జగపతిబాబు అడగ్గా.. ఇవన్నీ నాకు చాలా ముఖ్యమైన ఉంగరాలు అని సమాధానమిచ్చింది. అయితే, వీటిలో నీకు అత్యంత ఇష్టమైనది, ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన ఉంగరం ఒకటి ఉంది కదా? అని జగపతి బాబు సూటిగా ప్రశ్నించగా, రష్మిక కేవలం చిరునవ్వుతో దాటవేసింది. ఈ రింగ్ రహస్యం, విజయ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇద్దరూ బిజీబిజీ!
వృత్తిపరంగా, రష్మికా మందన్న ఇటీవల 'థమ్మా' అనే హిందీ హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి ప్రముఖులు నటించారు. ఇక లేటెస్ట్ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నవంబర్ 7న రిలీజ్ అయింది. మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా, త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించే మరో ప్రాజెక్టుకు కూడా ఆయన పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మొత్తంగా, విజయ్-రష్మికల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి ప్రతి కదలిక ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. వారిద్దరూ ఈఊహాగానాల కు ముగింపు పలికి, శుభవార్తను ఎప్పుడు ప్రకటిస్తారా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది...
