హైదరాబాద్ శివారులో.. సొంత ఇంటి జాగా కొనాలనుకునే వారికి.. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్ శివారులో.. సొంత ఇంటి జాగా కొనాలనుకునే వారికి.. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
  • రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులో సొంత ఇంటి జాగా కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల, మేడ్చల్ జిల్లాలో ఒకచోట మొత్తం మూడు కీలక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం వేస్తోంది. రంగారెడ్డి జిల్లా తోర్రూర్, కుర్మల్ గూడతోపాటు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బహదూర్ పల్లిలోని వెంచర్లలో ఉన్న ప్లాట్లను ఈ -వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 

ఈ నెల17, 18 తేదీల్లో వేలం ప్రక్రియ జరగనుండగా, చదరపు గజానికి రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ప్రారంభ ధరను నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశిత ఈఎండీ (ధరావతు) చెల్లించి వేలంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. తొర్రూర్ లో125, బహదూర్‌‌‌‌ పల్లిలో 13, కుర్మల్‌‌‌‌గూడలో 25 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 

ప్లాట్ల సైజులు, ధరలు, వేలం స్థలం తెలుసుకునేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ల వంటి పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు www.swagruha.telangana.gov.in వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌ ను సందర్శించవచ్చు. ఇతర వివరాల కోసం తొర్రూరు– 8121022230, 9959053583, బహదూర్ పల్లి– 7993455802, కుర్మల్ గూడ– 7993455784 నంబర్లను కూడా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.