మారుతి సుజుకి భారత ఆటో రంగంలో మరో భారీ మైలురాయిని సాధించింది. సంస్థ గడచిన 42 ఏళ్ల ప్రయాణంలో ఇండియన్ మార్కెట్లో ఏకంగా 3 కోట్ల కార్ల అమ్మకాలను సాధించింది. దేశంలో ఈ స్థాయిలో కార్లను అమ్మి మైలురాయిని అందుకున్న ఏకైక కంపెనీగా మారుతీ సుజుకీ రికార్డ్ సృష్టించింది.
మారుతి సుజుకి 1983 డిసెంబరు 14న తన మొట్టమొదటి మారుతి 800ను కస్టమర్లకు డెలివరీ చేసింది. ఈ సంఘటనతో భారత ఆటోమొబైల్ రంగంలో విప్లవంలా మారింది. ఆ తర్వాత కంపెనీ కోటి కార్ల అమ్మకాలను చేరుకోవటానికి 28 ఏళ్ల 2నెలల సమయం పట్టింది. ఆ తర్వాత మరో కోటి వాహనాల అమ్మకానికి 7 సంవత్సరాల 5 నెలల సమయం తీసుకుంది. ఇక చివరిగా మూడో కోటి వాహనాలను అమ్మటానికి 6 సంవత్సరాల 4 నెలల సమయం మాత్రమే పట్టడం గమనార్హం.
అయితే ఈ ఆటో దిగ్గజ కంపెనీ మెుత్తం తాను అమ్మిన కార్లలో 47 లక్షలు కేవలం మారుతీ ఆల్టో మోడల్ కార్లు కావటం గమనార్హం. దీని తర్వాత వాగన్ ఆర్ మోడల్ కార్లను అత్యధికంగా 34 లక్షల యూనిట్లను విక్రయించింది కంపెనీ. ఇక అత్యంత ప్రజాధరణ పొందిన మారుతీ స్విఫ్ట్ 32 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతం కంపెనీ ఎస్ యూవీలు, బ్రెజా, ఫ్రాంక్స్ టాప్ 10 విక్రయ మోడళ్లలో ఉన్నట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మారుతి కార్లను తమ ప్రయాణాల కోసం ఎంచుకోవడం ఎంతో గర్వంగా ఉందని మారుతి సుజుకి MD & CEO హిసాషి టకేయూచీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇంకా చాలామందికి తమ కార్ల ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుతం మారుతీ 19 వివిధ మోడళ్లు అందులోనూ 170 వేరియంట్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీకి 3800 మంది డీలర్ల నెట్ వర్క్ ఉంది.
మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, హ్రైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి వివిధ మోడళ్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 1000 మందిలో కేవలం 33 మందికి మాత్రమే కార్లు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుకూలమైన వాహనాలు తమ నుంచి వస్తాయని మారుతీ సుజుకీ చెబుతోంది. భారతీయులు నమ్మదగిన అత్యంత ప్రజాధరణ పొందుతున్న బ్రాండ్లలో ఒకటిగా ఈ జపాన్ కంపెనీ మారిపోయింది.
