తిరుమల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, నవంబరు 21న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం (నవంబర్ 6) తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు.
కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సీఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
