బీఆర్ఎస్‎కు ఓటేస్తే వృథా.. కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీలో పోరాడుతం: మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్‎కు ఓటేస్తే వృథా.. కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీలో పోరాడుతం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‎కు ఓటేస్తే వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం (నవంబర్ 6) తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో జూబ్లీహిల్స్ ఓటర్లతో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది. మంత్రి ఉత్తమ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎కు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని..సామాజిక న్యాయం, అన్ని కులాలు ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ లబ్ది కోసం ముస్లింలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. 

►ALSO READ | తెలంగాణలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్: మంత్రి తుమ్మల

అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా బతకాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తుందన్నారు. కొల్లూరు ఫేజ్-2లోని ప్రతీ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.