హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్ అని ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలు తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గురువారం (నవంబర్ 6) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్దానాలు, లక్షలాది కోట్ల బాకీల సంగతి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది కరంగా ఉన్నప్పటికీ గడిచిన 20 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్న తుమ్మల.. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు రోజుకొకరు తెలంగాణకు వస్తున్నట్లు చెప్పారు.
