నానో కంటే బుల్లి కారు.. హీరో నోవస్ పేరుతో త్వరలో విడుదల

 నానో కంటే బుల్లి కారు.. హీరో నోవస్ పేరుతో త్వరలో విడుదల

Novus EV: దేశంలోని ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంల్లో కొత్త సంచలనం సృష్టించింది. మంగళవారం కంపెనీ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ 'VIDA' నుంచి సరికొత్త 'నోవస్'  మైక్రో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్‌ను ఆవిష్కరించింది. కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాకుండా.. భవిష్యత్ ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్ ఈ ముందడుగు వేసింది. 

ఇటలీలోని మిలన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రపంచ ద్విచక్ర వాహనాల ఎగ్జిబిషన్ EICMA 2025 వేదికగా దీనిని కంపెనీ ఆవిష్కరించింది. కంపెనీ కేవలం ఫోర్-వీలర్‌తో ఆగకుండా.. పలు వినూత్నమైన మొబిలిటీ పరిష్కారాలను ప్రదర్శించింది.

NEX 1: ఇది పోర్టబుల్, వేరబుల్ మైక్రో మొబిలిటీ పరికరం. చిన్నపాటి ప్రయాణాలకు, క్యాంపస్‌లలో ఉపయోగించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

NEX 2: ఇది ఎలక్ట్రిక్ ట్రైక్ (మూడు చక్రాల వాహనం). ఇది వస్తువుల డెలివరీకి, చిన్న సిటీ మెుబిలిటీ అవసరాలకు ఉపయోగపడుతుంది.

NEX 3 : 'నోవస్' శ్రేణిలో కీలకంగా నిలిచిన NEX 3 ఒక నాలుగు చక్రాలు మైక్రో ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో ముందు-వెనుక కూర్చునే సౌకర్యంతో ఇద్దరు ప్రయాణించవచ్చు. చాలా మంది దీనిని టాటాలకు చెందిన న్యానో కారుతో పోల్చుతున్నారు. 

నోవస్ (Novus) రెన్యూవబుల్ అలాగే రీఇన్వెన్షన్ కి ప్రతీక అని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ప్రపంచం ఎలా కదులుతుందో దీని ద్వారా ఊహించుకోవచ్చన్నారు. ఇది తెలివిగా, అందరినీ కలుపుకొనిపోయే భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. NEX 3 పట్టణ, గ్రామీణ ప్రయాణాల కోసం నాలుగు చక్రాలతో భద్రత, సౌకర్యాన్ని అందించే'ఆల్-వెదర్ పర్సనల్ ఈవీ'గా నిలుస్తుందని చెప్పారు.