న్యూఢిల్లీ: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. 2026 మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో అన్ని జట్లు తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను గురువారం (నవంబర్ 6) విడుదల చేశాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన ఇండియా జట్టులోని చాలా మంది ప్లేయర్లతో పాటు, ఇతర టీముల్లోని కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి.
అయితే.. గుజరాత్ ఫ్రాంచైజ్ వ్యూహాలు మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న కేవలం ఆష్లీ గార్డనర్, బెత్ మూనీలను మాత్రమే అంటిపెట్టుకుంది. వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, ఫైనల్‌లో వరుసగా సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, సెమీస్‌లో భారత్‌పై శతకంతో చెలరేగిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను రిటైన్ చేసుకోకుండా ఆక్షన్‌కు వదిలేసింది. 2025 ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు (571) చేసిన బ్యాటర్ లారా వోల్వార్డ్టే కావడం గమనార్హం.
అలాంటి ప్లేయర్లను గుజరాత్ రిటైన్ చేసుకోకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ వేలంలో తొలిసారిగా రైట్-టు-మ్యాచ్ (RTM) కార్డును బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీఎమ్ ద్వారా తిరిగి లారా వోల్వార్డ్ట్‌ను గుజరాత్ దక్కించుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గుజరాత్ ఆర్టీఎమ్ ఉపయోగించకపోయిన వేలంలో లారా వోల్వార్డ్ట్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
గుజరాత్ జెయింట్స్ రిటెన్షన్ లిస్ట్:
ఆష్లీ గార్డనర్ రూ. 3.5 కోట్లు
బెత్ మూనీ రూ. 2.5 కోట్లు
