దోహా/దుబాయ్: మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ ప్రభావం క్రీడా ప్రపంచంపైనా పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు, ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు మూతపడటంతో ఇండియా క్రీడాకారులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.
అల్బేనియాలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్‌లో ఏడు పతకాలు సాధించిన 16 మంది ఇండియా రెజ్లర్లు దుబాయ్ మీదుగా రావాల్సి ఉండగా విమానాలు రద్దవ్వడంతో ప్రస్తుతం అక్కడే వేచి చూస్తున్నారు. అలాగే లెబనాన్‌తో జరగాల్సిన ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ వాయిదా పడటంతో ఇండియా మెన్స్ బాస్కెట్‌బాల్ జట్టు దోహాలో చిక్కుకుంది.
మరోవైపు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు తన కోచ్‌తో కలిసి దుబాయ్‌లోనే ఉండిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న క్రీడాకారులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశం ఎప్పుడు చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు టెన్నిస్ స్టార్ డానియల్ మెద్వెదెవ్ దుబాయ్‌లో చిక్కుకుపోవడంతో త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
20 మంది విమెన్ సాకర్ ప్లేయర్లు మృతి
ఇరాన్ లోని ఫార్స్ ప్రావిన్స్‌లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై జరిగిన మిస్సైల్ దాడిలో 20 మంది విమెన్ సాకర్ ప్లేయర్లు మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.. అటు ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లడంపై ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మెహదీ తాజ్ సందేహాలు వ్యక్తం చేశాడు.
